
యూపీ టీ20 లీగ్-2025.. ఫైనల్ మ్యాచ్‌కు ముందు మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంలో చిక్కుకుంది. ఈ టోర్నీలోని లీగ్ స్టేజి మ్యాచ్‌లను ఫిక్సింగ్ చేయడానికి బుక్కీలు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ విషయం బీసీసీఐ యాంటీ కరప్షన్ విభాగం దృష్టికి వెళ్లింది. అనంతరం లక్నో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం.
టైమ్స్ నౌ రిపోర్ట్ ప్రకారం.. కాశీ రుద్రాస్ టీమ్ మేనేజర్ అర్జున్ చౌహాన్‌కు ‘vipss_nakrani’ అనే యూజర్ నుంచి ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఓ మెసెజ్ వచ్చింది. అందులో తను బుకీని అని, మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తే కోటి రూపాయలతో పాటు అదనంగా 50 లక్షల రూపాయల కమిషన్ ఇస్తానని రాసి ఉందంట. వెంటనే అర్జున్ ఈ విషయాన్ని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగానికి తెలియజేశాడు.
ఆతర్వాత ఏసీయూ సభ్యలు బుకీ ఫోన్ నంబర్ పొందడానికి ఇన్‌స్టాగ్రామ్‌లో చాట్‌ను కంటిన్యూ చేశారు. ఆటగాళ్లు తన సూచనలను పాటించాలని, మ్యాచ్‌ల సమయంలో తన సహచరులతో కలిసి మైదానంలో ఉంటానని కూడా బుకీ వెల్లడించాడు.
ఈ క్రమంలో ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలను, కాల్‌లను మరొక ఫోన్‌లో రికార్డు చేసి పోలీస్‌లకు అధారాలగా బీసీసీఐ ఏసీయూ అప్పగించింది. దీంతో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ విషయాన్ని లక్నో డీసీపీ ధ్రువీకరించారు. కాగా యూపీ టీ20 లీగ్ విషయానికి వస్తే.. శనివారం ఫైనల్ పోరులో ఎకానా స్టేడియం వేదికగా కాశీ రుద్ర, మీరట్ మావెరిక్స్ జట్లు తలపడనున్నాయి.