Lisa Sthalekar: సరికొత్త చరిత్ర సృష్టించిన ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ లీసా.. ఆ పదవిలో తొలి మహిళగా!

Lisa Sthalekar Becomes First Woman To Be President Of FICA - Sakshi

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత లీసా స్తాలేకర్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ క్రికెటర్స్‌ అసోసియేషన్‌(ఎఫ్‌ఐసీఏ) అధ్యక్ష పదవి దక్కించుకున్న తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. అంతర్జాతీయ క్రికెటర్ల సమాఖ్య అధ్యక్షురాలిగా ఆమె నియామకాన్ని ఖరారు చేస్తూ మంగళవారం నిర్ణయం తీసుకున్నారు.

స్విట్జర్లాండ్‌లోని నియాన్‌ వేదికగా జరిగిన ఎఫ్‌ఐసీఏ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశంలో ఈ మేరకు ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ మాజీ బ్యాటర్‌ విక్రమ్‌ సోలంకి స్థానాన్ని లీసా స్తాలేకర్‌ భర్తీ చేయనున్నారు. ఇక గతంలో దక్షిణాఫ్రికా మాజీ బ్యాటర్‌ బ్యారీ రిచర్డ్స్‌, వెస్టిండీస్‌ మాజీ ఆల్‌రౌండర్‌ జిమ్మీ ఆడమ్స్‌ ఈ పదవిని చేపట్టారు.

తన నియామకంపై హర్షం వ్యక్తం చేసిన లీసా.. తనకు దక్కిన గొప్ప గౌరవం ఇది అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. గ్లోబల్‌ గేమ్‌ క్రికెట్‌లో నూతన దశ ఆరంభమైందని, ఇక్కడ పురుషులు, మహిళలు అనే అసమానతలకు తావు లేకుండా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. కాగా 1998లో స్థాపించబడిన ఎఫ్‌ఐసీఏ అంతర్జాతీయ క్రికెటర్లకు ప్రాతినిథ్యం వహిస్తూ వారికి సంబంధించిన పలు అంశాల్లో గళం వినిపిస్తుంది. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ క్రికెట్‌ ప్లేయింగ్‌ కమిటీలో ఈ సమాఖ్య ప్రతినిధి ఉంటారు.

అత్యుత్తమ మహిళా క్రికెటర్‌గా
లీసా స్తాలేకర్‌ ఆస్ట్రేలియా తరఫున 187 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు. అంతర్జాతీయ స్థాయిలో ఆసీస్‌ అత్యుత్తమ మహిళా క్రికెటర్‌గా పేరొంది తద్వారా 2007, 2008లో బెలిండా క్లార్క్‌ అవార్డు దక్కించుకున్నారు. టీ20 వరల్డ్‌కప్‌-2010 ఫైనల్లో ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించారు.

చదవండి: BCCI- IPL: కచ్చితంగా.. భారత్‌ ఏం చెబితే అదే జరుగుతుంది.. ఎందుకంటే: ఆఫ్రిది

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top