మెస్సీ, సచిన్‌.. నమ్మశక్యం కాని రీతిలో ఒకేలా..!

Lionel Messi And Sachin Tendulkar World Cup Journey Similarities - Sakshi

క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌, ఫుట్‌బాల్‌ ఆల్‌టైమ్‌ గ్రేట్‌ లియోనల్‌ మెస్సీ వరల్డ్‌కప్‌ జర్నీ నమ్మశక్యం కాని రీతిలో ఒకేలా కొనసాగడం క్రీడాభిమానులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. ఈ ఇద్దరు దిగ్గజాలు తమ కెరీర్‌లో తొలి వరల్డ్‌కప్‌ సాధించే క్రమంలో చాలా విషయాల్లో దగ్గరి పోలికలు (దాదాపు ఒకేలా) కలిగి ఉన్నారు.

10 నంబర్‌ జెర్సీ ధరించే ఈ ఇద్దరు లెజెండ్స్‌.. తమ కెరీర్‌లో చివరి వరల్డ్‌కప్‌ ఆడుతున్నామని ముందే ప్రకటించి మరీ తమ జట్లను జగజ్జేతలుగా నిలిపారు. గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌ (GOAT)గా కీర్తించబడే సచిన్‌, మెస్సీ వారివారి వరల్డ్‌కప్‌ జర్నీలో 8 ఏళ్ల క్రితం చివరిసారి ఛాంపియన్‌గా నిలిచే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నారు. 

సచిన్‌ ప్రాతినిధ్యం వహించిన టీమిండియా 2003 వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌ దాకా చేరి, తుది సమరంలో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలై రన్నరప్‌తో సరిపెట్టుకుంది. సరిగ్గా 8 సంవత్సరాల తర్వాత టీమిండియా 2011లో వన్డే వరల్డ్‌కప్‌ను ముద్దాడింది. మెస్సీ విషయంలో ఇలానే జరిగింది.

2014 ఫిఫా వరల్డ్‌కప్‌ ఫైనల్లో మెస్సీ ప్రాతినిధ్యం వహించిన అర్జెంటీనా.. జర్మనీ చేతిలో ఓటమిపాలై ఛాంపియన్‌షిప్‌కు అడుగు దూరంలో నిలిచిపోయింది. అయితే సరిగ్గా 8 ఏళ్ల తర్వాత సచిన్‌ విషయంలో జరిగినట్టే మెస్సీ విషయంలోనూ జరిగింది. 2022 ఫిఫా వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఫ్రాన్స్‌ను ఓడించి మెస్సీ సారధ్యంలోని అర్జెంటీనా జగజ్జేతగా అవతరించింది. 

యాదృచ్చికంగా ఈ ఇద్దరు ప్రాతినిధ్యం వహించే జట్లు చివరిసారిగా వరల్డ్‌కప్‌ను 1980ల్లోనే నెగ్గాయి. లెజెండ్‌ కపిల్‌ దేవ్‌ సారధ్యంలో భారత్‌ 1983లో వన్డే వరల్డ్‌కప్‌ కైవసం చేసుకోగా.. 80వ దశకంలోనే (1986లో) ఫుట్‌బాల్‌ మాంత్రికుడు డీగో మారడోనా నేతృత్వంలో అర్జెంటీనా వరల్డ్‌ ఛాంపియన్‌గా నిలిచింది.  

ఇవే కాక సచిన్‌, మెస్సీ తమతమ వరల్డ్‌కప్‌ జర్నీలను సంబంధించి మరిన్ని విషయాల్లో పోలికలు కలిగి ఉన్నారు. సచిన్‌ 2011 వరల్డ్‌కప్‌లో అత్యధిక పరుగులు (9 మ్యాచ్‌ల్లో 482 పరుగులు) చేసిన భారత ఆటగాడిగా నిలువగా.. మెస్సీ 2022 ఫిఫా వరల్డ్‌కప్‌లో అత్యధిక గోల్స్‌ (7 గోల్స్‌) సాధించిన అర్జెంటీనా ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.

అలాగే ఈ ఇద్దరు దిగ్గజాలు తమ ప్రపంచకప్‌ ప్రయాణంలో సెమీఫైనల్‌ మ్యాచ్‌ల్లో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు గెలుచుకున్నారు. సచిన్‌.. పాకిస్తాన్‌తో జరిగిన సెమీస్‌లో 85 పరుగుల మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌ ఆడి ఈ అవార్డుకు ఎంపిక కాగా.. క్రొయేషియాతో జరిగిన సెమీస్‌లో మెస్సీ ఒక గోల్‌ సాధించడంతో పాటు మరో రెండు గోల్స్‌ కొట్టడంలో జూలియన్‌ అల్వారెజ్‌కు సహకరించి ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డును సొంతం చేసుకున్నాడు.

వీటితో పాటు తమ చిరకాల కోరిక నెరవేరిన అనంతరం ఈ ఇద్దరు దిగ్గజాలను సహచర సభ్యులు యాదృచ్చికంగా ఒకేలా సత్కరించారు. ప్రపంచకప్‌ నెగ్గిన అనంతరం ఈ ఇద్దరిని సహచరులు భుజాలపై ఎక్కించుకుని స్టేడియం మొత్తం ఊరేగించారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top