
రేపటి నుంచి (జులై 30) జింబాబ్వేతో ప్రారంభం కాబోయే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ముందు న్యూజిలాండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. భుజం గాయం కారణంగా ఆ జట్టు కెప్టెన్ టామ్ లాథమ్ తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడు. లాథమ్ గైర్హాజరీలో మిచెల్ సాంట్నర్ న్యూజిలాండ్ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. సాంట్నర్ న్యూజిలాండ్ టెస్ట్ జట్టుకు 32వ కెప్టెన్ అవుతాడు.
లాథమ్ ఇటీవల ఇంగ్లండ్‌లో జరిగిన ఓ టీ20 మ్యాచ్ సందర్భంగా గాయపడ్డాడు. జింబాబ్వేతో తొలి టెస్ట్ సమయానికి లాథమ్ పూర్తిగా కోలుకోకపోవడంతో అతనికి ప్రత్యామ్నాయంగా సాంట్నర్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు.
సాంట్నర్ ఇటీవల జింబాబ్వేలోనే జరిగిన ముక్కోణపు టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్‌ను విజేతగా నిలిపాడు. ఈ టోర్నీ మొత్తంలో అజేయ జట్టుగా నిలిచిన న్యూజిలాండ్.. ఫైనల్లో సౌతాఫ్రికాతో జరిగిన క్లోజ్ ఫైట్‌లో 3 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ టోర్నీలో ఫైనల్ సహా అన్ని మ్యాచ్‌ల్లో రాణించిన మ్యాట్ హెన్రీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్ అవార్డులు దక్కాయి.
జింబాబ్వే వర్సెస్ న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్..
జులై 30 నుంచి ఆగస్ట్ 3- తొలి టెస్ట్ (బులవాయో)
ఆగస్ట్ 7 నుంచి 11- రెండో టెస్ట్ (బులవాయో)
జింబాబ్వేతో టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు..
హెన్రీ నికోల్స్, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, మైఖేల్ బ్రేస్‌వెల్, నాథన్ స్మిత్, మిచెల్ సాంట్నర్, డారిల్ మిచెల్, డెవాన్ కాన్వే, టామ్ బ్లండెల్, విలియమ్ ఓరూర్కీ, అజాజ్ పటేల్, జేకబ్ డఫీ, మాథ్యూ ఫిషర్, మ్యాచ్ హెన్రీ