మిట్టల్‌ చేతికి రాజస్తాన్‌ రాయల్స్‌ | Lakshmi Mittal announces acquisition of Rajasthan Royals franchise | Sakshi
Sakshi News home page

మిట్టల్‌ చేతికి రాజస్తాన్‌ రాయల్స్‌

May 4 2026 6:04 AM | Updated on May 4 2026 6:04 AM

Lakshmi Mittal announces acquisition of Rajasthan Royals franchise

రూ. 15,660 కోట్లకు కొనుగోలు

లక్ష్మీ మిట్టల్‌కు 75 శాతం వాటా 

పూనావాలాకు 18 శాతం వాటా

న్యూఢిల్లీ: ప్రముఖ పారిశ్రామికవేత్త లక్ష్మీ మిట్టల్‌ ఐపీఎల్‌ ఫ్రాంచైజీ రాజస్తాన్‌ రాయల్స్‌ను కొనుగోలు చేశారు. లక్ష్మీ మిట్టల్, ఆయన కుమారుడు ఆదిత్య మిట్టల్, అదర్‌ పూనావాలాతో కలిసి 165 కోట్ల డాలర్ల (రూ. 15,660 కోట్లు) బిడ్‌తో రాయల్స్‌లో మెజారిటీ వాటాను సొంతం చేసుకున్నారు. ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఫ్రాంచైజీతో పాటు... వేర్వేరు లీగ్‌ల్లో పార్ల్‌ రాయల్స్, బార్బడోస్‌ రాయల్స్‌ జట్లు కూడా మిట్టల్‌ సొంతం అయ్యాయి. 

ఐపీఎల్‌ గవరి్నంగ్‌ కౌన్సిల్, బీసీసీఐ పాలక మండలి ఆమోదం అనంతరం ఈ లావాదేవీ పూర్తి కానుంది. ఈ ప్రక్రియ ముగియడానికి మరో మూడు నెలలు పట్టొచ్చని సమాచారం. ‘మనోజ్‌ బదాలే కన్సార్టియం నుంచి అదర్‌ పూనావాలా భాగస్వామ్యంతో రాజస్తాన్‌ రాయల్స్‌ను కొనుగోలు చేసుకోవడానికి ఒప్పందం కుదిరింది’ అని మిట్టల్‌ కుటుంబం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆ వివరాల ప్రకారం రాయల్స్‌ జట్టులో మిట్టల్‌ కుటుంబం 75 శాతం వాటా కలిగి ఉంటుంది. పూనావాలా 18 శాతం వాటా కలిగి ఉంటారు. 

మిగిలిన 7 శాతం వాటాలో పాత యజమాని మనోజ్‌ బదాలేతో పాటు ఇతర పెట్టుబడిదారులు ఉంటారు. దీంతో రాయల్స్‌ బోర్డులో లక్ష్మీ మిట్టల్, ఆదిత్య మిట్టల్, వనిషా మిట్టల్‌–భాటియా, అదర్‌ పూనావాలా, మనోజ్‌ బదాలే సభ్యులుగా ఉంటారు. రాజస్తాన్‌ సాదుల్‌పూర్‌లో జన్మించిన లక్ష్మీ మిట్టల్‌ మాట్లాడుతూ... ‘నాకు క్రికెట్‌ అంటే చాలా ఇష్టం. మా కుటుంబం రాజస్తాన్‌కు చెందింది. అందుకే వాటా కొనుగోలు చేసేందుకు రాజస్తాన్‌ రాయల్స్‌ కంటే మంచి జట్టు లేదనిపించింది’ అని అన్నారు. రెండు నెలల క్రితం భారత సంతతికి చెందిన అమెరికా వ్యాపారవేత్త కాల్‌ సోమాని కన్సార్టియం రాజస్తాన్‌ రాయల్స్‌ను కొనుగోలు చేయనుందని వార్తలు వచ్చాయి. అయితే పలు కారణాల వల్ల ఆ ఒప్పందం కార్యరూపం దాల్చలేదు.  

Advertisement
 
Advertisement
Advertisement