
సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. రెండో రోజు ఆటముగిసే సమయానికి పుజారా(9 బ్యాటింగ్), రహానే(5 బ్యాటింగ్)లు క్రీజ్‌లో ఉన్నారు. ఓపెనర్లు రోహిత్(26;77 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్స్) , శుబ్‌మన్ గిల్(50;101 బంతుల్లో 8 ఫోర్లు) ల వికెట్లను భారత్ చేజార్చుకుంది. కాగా, ఈ రోజు ఆటలో టీమిండియా ఓపెనర్లలను ఆసీస్ క్రికెటర్ లబూషేన్ స్లెడ్జింగ్ చేశాడు. ఈ జోడి నిలకడగా ఇన్నింగ్స్‌ను ఆరంభించడంతో ఆసీస్ స్లెడ్జింగ్‌కు దిగింది. ఈ క్రమంలోనే ఆ బాధ్యతను లబూషేన్ తనపై వేసుకున్నాడు. ప్రధానంగా గిల్‌ను టార్గెట్ చేస్తూ అసందర్భమైన ప్రశ్నలు వేశాడు.
ఫార్వర్డ్ షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న లబూషేన్.. గిల్‌ను ‘నీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు’ అంటూ ప్రశ్నించడంతో స్లెడ్జింగ్ ఆరంభించాడు. స్టార్క్ వేసిన రెండో ఓవర్‌లో గిల్‌ను ఫేవరెట్ క్రికెటర్ ఎవరు అంటూ ప్రశ్నించాడు. దానికి గిల్ అదిరిపోయే సమాధానం ఇచ్చాడు. దానికి సమాధానం కావాలంటే మ్యాచ్ ముగిసిన తర్వాత చెబుతాలే అంటూ బదులిచ్చాడు. అయితే ఆ తర్వాత బంతికి సచిన్..లేక విరాట్ అంటూ మళ్లీ నిలదీశాడు లబూషేన్. ఆపై రోహిత్ స్ట్రైకింగ్ వచ్చిన తర్వాత కూడా లబూషేన్ అదే తరహాలో విసిగించాడు. ‘హేయ్.. క్వారంటైన్ ఏం చేశావ్’ అంటూ రోహిత్‌పై స్లెడ్జింగ్‌కు పాల్పడ్డాడు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆలస్యంగా ఆ గడ్డపై అడుగుపెట్టిన రోహిత్ 14 రోజుల పాటు క్వారంటైన్‌లోఉన్నాడు.దీన్ని ఉద్దేశిస్తూ లబూషేన్ తన నోటికి పని చెప్పాడు. ఈ వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) తమ ట్వీటర్ అకౌంట్‌లో పోస్ట్ చేయగా, అది వైరల్‌గా మారింది.
.@marnus3cricket was enjoying being back under the helmet for the Aussies! #AUSvIND pic.twitter.com/GaCWPkTthl
— cricket.com.au (@cricketcomau) January 8, 2021