మీకు రూట్‌ ఉంటే.. మాకు కుల్దీప్‌ సార్‌ ఉన్నారు! అంతేగా? | Sakshi
Sakshi News home page

IND vs ENG: మీకు రూట్‌ ఉంటే.. మాకు కుల్దీప్‌ సార్‌ ఉన్నారు! అంతేగా?

Published Sun, Feb 25 2024 11:11 AM

Kuldeep Yadavs gritty knock in Ranchi Test - Sakshi

ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ అద్బుతమైన పోరాట పటిమ కనబరిచాడు. జడేజా, గిల్‌, సర్ఫరాజ్‌ వంటి స్టార్‌ బ్యాటర్లు ఇంగ్లండ్‌ స్పిన్‌ ఉచ్చులో చిక్కుకున్న చోట.. కుల్దీప్‌ తన క్లాస్‌ను చూపించాడు. తొలి ఇన్నింగ్స్‌ కేవలం 177 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో పడింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన కుల్దీప్‌.. ఇంగ్లీష్‌ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. 

తన డిఫెన్స్‌తో ఇంగ్లండ్‌ స్పిన్నర్లకు విసుగు తెప్పించాడు. అంతేకాకుండా వీలుచిక్కినప్పుడల్లా పరుగులు రాబడుతూ స్కోర్‌ బోర్డును ముందుకు నడిపించాడు. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ దృవ్‌ జురల్‌తో కలిసి భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. దృవ్‌ జురల్‌తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 76 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 131 బంతులు ఎదుర్కొన్న యాదవ్‌ 2 ఫోర్ల సాయంతో 28 పరుగులు చేశాడు.

ఆఖరికి జేమ్స్‌ ఆండర్స్‌ బౌలింగ్‌లో కుల్దీప్‌ ఔటయ్యాడు. కాగా భారత తొలి ఇన్నింగ్స్‌లో అందరి కంటే ఎక్కువ బంతులు కుల్దీప్ యాదవే ఎదుర్కోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో కుల్దీప్‌ అద్భుత ఇన్నింగ్స్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

చేసింది 28 పరుగులే కానీ సెంచరీ కంటే ఎక్కువంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి కొంత మంది అయితే "మీకు రూట్‌ ఉంటే.. మా​కు కుల్దీప్‌ సార్‌ ఉన్నాండంటూ" ఇంగ్లండ్‌ను ఉద్దేశించి పోస్టులు చేస్తున్నారు. కాగా రూట్‌ కూడా తన అద్బుత సెంచరీతో ఇంగ్లండ్‌ను అదుకున్నాడు.

ఇక తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 94 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. దృవ్‌ జురల్‌(59) పరుగులతో బ్యాటింగ్‌ చేస్తున్నాడు. ఇంక భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 88 పరుగులు వెనుకంజలో ఉంది.

Advertisement
 
Advertisement