ఎవరిదో  తొలి విజయం!  | Kolkata Knight Riders square off against Sunrisers Hyderabad | Sakshi
Sakshi News home page

ఎవరిదో  తొలి విజయం! 

Apr 2 2026 5:15 AM | Updated on Apr 2 2026 12:00 PM

 Kolkata Knight Riders square off against Sunrisers Hyderabad

నేడు కోల్‌కతాతో సన్‌రైజర్స్‌ మ్యాచ్‌

మొదటి మ్యాచ్‌లో ఓడిన ఇరు జట్లు

రాత్రి గం. 7:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం 

కోల్‌కతా: ఐపీఎల్‌లో మాజీ చాంపియన్లు అయిన రెండు జట్ల మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. ఈడెన్‌ గార్డెన్స్‌లో నేడు జరిగే మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తలపడుతుంది. ఈ రెండు జట్లు కూడా తమ తొలి మ్యాచ్‌లలో ఓడిన నేపథ్యంలో మొదటి గెలుపుపై దృష్టి పెట్టాయి. సొంత మైదానంలో  ప్రత్యర్థికంటే కేకేఆర్‌దే కాస్త పైచేయిగా కనిపిస్తోంది. 201, 220... తమ మొదటి మ్యాచ్‌లో బెంగళూరుపై హైదరాబాద్, ముంబైపై కోల్‌కతా చేసిన స్కోర్లు ఇవి. అయినా సరే వాటికి ఓటమి తప్పలేదు. 

బౌలింగ్‌ బలహీనతల కారణంగా పరాజయం ఎదుర్కొన్న టీమ్‌లు ఎలా వ్యూహరచన చేస్తాయనేది ఆసక్తికరం. ప్యాట్‌ కమిన్స్‌ లేకపోవడంతో ఇప్పటికే హైదరాబాద్‌ బౌలింగ్‌లో పస తగ్గింది. జైదేవ్‌ ఉనాద్కట్, హర్షల్‌ పటేల్, హర్ష్‌ దూబే బౌలింగ్‌తో కోల్‌కతాను ఏమాత్రం నిలువరించగలరో చూడాలి. తొలి మ్యాచ్‌లో విఫలమైన హెడ్, అభిషేక్‌ శర్మ చెలరేగితే తిరుగుండదు. ఇషాన్, క్లాసెన్‌ తమ ఫామ్‌ను ఇప్పటికే చూపించు కున్నారు. 

మరోవైపు కేకేఆర్‌ బౌలింగ్‌ పరిస్థితి కూడా ఇబ్బందికరంగానే ఉంది. వైభవ్‌ తేలిపోగా, ముజరబానికి తగినంత అనుభవం లేదు. వరుణ్‌ కూడా భారీగా పరుగులివ్వడంతో టీమ్‌లో ఆందోళన రేపే అంశం. బ్యాటింగ్‌లో రహానే, అలెన్‌ శుభారంభం అందించాల్సి ఉంది.  

ఐపీఎల్‌లో కోల్‌కతా, హైదరాబాద్‌ మధ్య 30 మ్యాచ్‌లు జరిగాయి. 20 మ్యాచ్‌ల్లో కోల్‌కతా, 10 మ్యాచ్‌ల్లో హైదరాబాద్‌ గెలిచింది. కోల్‌కతాపై హైదరాబాద్‌ అత్యధిక స్కోరు 278 కాగా, అత్యల్ప స్కోరు 113. హైదరాబాద్‌పై కోల్‌కతా అత్యధిక స్కోరు 208 కాగా, అత్యల్ప స్కోరు 101గా ఉంది.    

Advertisement
 
Advertisement
Advertisement