
కౌలాలంపూర్: కెరీర్‌లో మరో అంతర్జాతీయ టైటిల్ సాధించాలని ఆశించిన భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్‌కు నిరాశ ఎదురైంది. మలేసియా ఓపెన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో ప్రపంచ మాజీ నంబర్‌వన్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ శ్రీకాంత్ రన్నరప్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 65వ ర్యాంకర్ శ్రీకాంత్ 11–21, 9–21తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ లీ షి ఫెంగ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు.
36 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ అడపాదడపా మెరిపించినా చివరకు చైనా ప్లేయర్‌దే పైచేయి అయింది. రన్నరప్‌గా నిలిచిన శ్రీకాంత్‌కు 18,050 డాలర్ల (రూ. 15 లక్షల 35 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 7800 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ‘మళ్లీ పోడియంపైకి వచ్చి పతకం అందుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తోంది.
ఫైనల్ ఫలితం నిరాశపరిచినా, ఓవరాల్‌గా ఈ టోర్నీలో నా ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నా’ అని 32 ఏళ్ల శ్రీకాంత్ వ్యాఖ్యానించాడు. 2017లో ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ సాధించిన తర్వాత శ్రీకాంత్ మరో అంతర్జాతీయ టైటిల్ నెగ్గలేకపోయాడు. 2019లో ఇండియా ఓపెన్‌లో, 2021 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఫైనల్ చేరిన శ్రీకాంత్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు.