ఒమన్ జాతీయ జట్టు కెప్టెన్‌గా ఉత్తరప్రదేశ్‌కు చెందిన వికెట్ కీపర్ బ్యాటర్ వినాయక్ శుక్లా ఎంపికయ్యాడు. ఏంటి యూపీ క్రికెటర్ ఒమన్ టీమ్ కెప్టెన్ కావడమేంటి అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే. అతడి ప్రయాణం ఎంతో మందికి స్పూర్తి దాయకం.
యూపీలోని కాన్పూర్‌లో జన్మించిన 31 ఏళ్ల వినాయక్ శుక్లా.. 2016లో పీఏసీ క్రికెట్ మైదానంలో కోచ్ లేఖ్‌చంద్ గుప్తా పర్యవేక్షణలో తన క్రికెట్ జర్నీని ప్రారంభించాడు. ఆ తర్వాత బెంగాల్‌కు తన మకాంను మార్చి కలకత్తా కస్టమ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు.
మళ్లీ ఉత్తర్‌ప్రదేశ్‌కు వచ్చి యూపీసీఏ అండర్-14, అండర్-16 ట్రయల్స్‌తో పాటు దేశవాళీ డొమెస్టిక్ క్యాంప్‌లకు హాజరైనప్పటికీ సెలెక్ట్ కాలేదు. సీనియర్ ప్లేయర్ ప్రకాష్ పలాండే సాయంతో క్లబ్ క్రికెట్ ఆడేందుకు కెన్యా కూడా వెళ్లాడు. కానీ కోవిడ్-19 మహమ్మారి కారణంగా 4 నెలల్లోనే భారత్‌కు తిరిగి రావాల్సి వచ్చింది.
టర్నింగ్ పాయింట్ ఇదే
భారత్‌లో క్రికెట్ ఆడే అవకాశాలు రాకపోవడంతో వినాయక్ ఉద్యోగం కోసం 2021లో ఒమన్‌కు వెళ్లిపోయాడు. అక్కడికి వెళ్లి 'నేషనల్ మెటల్‌కాన్స్' (National Metalcans)లో డేటా ఎంట్రీ అపరేటర్‌గా చేరాడు. ఓవైపు ఉద్యోగం చేస్తూనే.. క్రికెట్‌పై ఉన్న మక్కువతో అక్కడ స్ధానిక లీగ్‌ల్లో ఆడాడు. నేషనల్ మెటల్‌కాన్స్ కంపెనీ జట్టుకు అతడు ప్రాతినిధ్యం వహించాడు. దేశవాళీ క్రికెట్‌లో 'ఒమన్ స్టాలియన్స్' తరఫున కూడా అతడు ఆడాడు.
ఆ తర్వాత అతడికి 2023లో ఒమన్ 'ఎ' జట్టు తరపున పిలుపు వచ్చింది. అక్కడ కూడా మెరుగైన ప్రదర్శన చేయడంతో ఏడాది తిరగకముందే అతడు జాతీయ జట్టులో చోటు సంపాదించుకున్నాడు. 2024లో గల్ఫ్ కప్‌లో ఖతార్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒమన్ జట్టు తరపున శుక్లా డెబ్యూ చేశాడు.
ఇప్పుడు ఏకంగా అరంగేట్ర చేసిన రెండేళ్ల కాలంలోనే ఒమన్ కెప్టెన్ అయ్యి చరిత్ర సృష్టించాడు. సుదీర్ఘకాలం కెప్టెన్‌గా వ్యవహరించిన జతీందర్ సింగ్ స్థానాన్ని వినాయక్ భర్తీ చేయనున్నాడు. వినాయక్ ఇప్పటివరకు ఒమన్ తరపున 14 వన్డేలు, 22 టీ20లు ఆడాడు.


