ఐపీఎల్ 2026లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో ఇవాళ (మే 10) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. జోష్ ఇంగ్లిస్ (85) ఊచకోత కోశాడు. ఆఖర్లో షాబాజ్ అహ్మద్ (43 నాటౌట్) రాణించాడు.
వీరు మినహా ఎవరూ పెద్ద స్కోర్ చేయలేదు. మిచెల్ మార్ష్ 10, నికోలస్ పూరన్ 1, రిషబ్ పంత్ 15, మార్క్రమ్ 6, రఘువంశీ 18, హిమ్మత్ సింగ్ 17, షమీ డకౌటయ్యారు. సీఎస్‌కే బౌలర్లలో జేమీ ఓవర్టన్ 3 వికెట్లు పడగొట్టగా.. అన్షుల్ కంబోజ్ 2, నూర్ అహ్మద్ ఓ వికెట్ తీశాడు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన సీఎస్‌కే ఆది నుంచే దూకుడుగా ఆడింది. వన్‌డౌన్‌లో వచ్చిన ఉర్విల్ పటేల్ (65) పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. కేవలం 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, విజయానికి గట్టి పునాది వేశాడు.
అయితే మధ్యలో సీఎస్‌కే కాస్త తడబాటుకు లోనైంది. సునాయాసంగా గెలుస్తుందనుకుంటే, మ్యాచ్‌ను చివరి వరకు తీసుకొచ్చింది. చివరి ఓవర్ తొలి రెండు బంతులకు శివమ్ దూబే (15 నాటౌట్) సిక్సర్లు బాది సీఎస్‌కేను విజయతీరాలు దాటించాడు.
సీఎస్‌కే బ్యాటర్లలో సంజూ శాంసన్ 28, రుతురాజ్ గైక్వాడ్ 42, కార్తీక్ శర్మ 20, బ్రెవిస్ 10, ప్రశాంత్ వీర్ (18 నాటౌట్) పరుగులు చేశారు. లక్నో బౌలర్లలో దిగ్వేశ్ రాఠీ, షాబాజ్ అహ్మద్ తలో 2 వికెట్లు తీయగా.. ఆవేశ్ ఖాన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో లక్నో చాలా క్యాచ్‌లు జారవిడిచి మూల్యం చెల్లించుకుంది. ఈ ఓటమితో ఆ జట్టు ప్లే ఆఫ్స్ బెర్త్‌పై పూర్తిగా ఆశలు వదులుకుంది.
సీఎస్‌కే విషయానికొస్తే.. ఆదిలో వరుస పరాజయాలు ఎదుర్కొన్న ఈ జట్టు అనూహ్యంగా పుంజుకొని ప్లే ఆఫ్స్ రేసులో ప్రధాన పోటీదారుగా మారిపోయింది. ఈ గెలుపుతో ఆ జట్టు ఖాతాలో 12 పాయింట్లు (11 మ్యాచ్‌ల్లో 6 విజయాలు) చేరాయి. ప్రస్తుతం ఆ జట్టు పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది.


