
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మే 24) జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ పంజాబ్‌ను 6 వికెట్ల తేడాతో చిత్తు చేసి సీజన్‌ను గెలుపుతో ముగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేయగా.. ఢిల్లీ 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
పంజాబ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (53) అర్ద సెంచరీతో రాణించగా.. ప్రభసిమ్రన్ (28), జోష్ ఇంగ్లిస్ (32), స్టోయినిస్ (44 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ప్రియాంశ్ ఆర్య (6), నేహల్ వధేరా (16), శశాంక్ సింగ్ (11), అజ్మతుల్లా ఒమర్‌జాయ్ (1), మార్కో జన్సెన్ (0) నిరాశపరిచారు. ఢిల్లీ బౌలర్లలో ముస్తాఫిజుర్ 3, విప్రాజ్, కుల్దీప్ తలో 2, ముకేశ్ కుమార్ ఓ వికెట్ పడగొట్టారు.
ఢిల్లీ తరఫున సమీర్ రిజ్వి (58 నాటౌట్) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడగా.. కరుణ్ నాయర్ (44), కేఎల్ రాహుల్ (35), డుప్లెసిస్ (23), సెదీఖుల్లా అటల్ (22), ట్రిస్టన్ స్టబ్స్ (18 నాటౌట్) కూడా అదే తరహా ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నారు. పంజాబ్ బౌలర్లలో హర్ప్రీత్ బ్రార్ 2, జన్సెన్, ప్రవీణ్ దూబే తలో వికెట్ పడగొట్టారు.
In a such a high profile tournament with so much technology at the Third Umpire’s disposal such mistakes are unacceptable & simply shouldn’t happen. I spoke To Karun after the game & he confirmed it was DEFINITELY a 6 ! I rest my case ! #PBKSvsDC #IPL2025 https://t.co/o35yCueuNP
— Preity G Zinta (@realpreityzinta) May 24, 2025
ప్రీతి జింటా ఆగ్రహం
కాగా, ఈ మ్యాచ్‌లో జరిగిన ఓ తప్పిదంపై పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పంజాబ్ ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో శశాంక్ సింగ్ లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడగా.. బౌండరీ లైన్‌పై కరుణ్ నాయర్ అద్భుతంగా బంతిని అడ్డుకున్నాడు.
ఈ క్రమంలో బంతి చేతిలో ఉండగా.. కరుణ్ కాలు బౌండరీ లైన్ టచ్ అయినట్లు స్పష్టంగా కనిపించింది. కరుణ్ కూడా అది సిక్సరే అంటూ సిగ్నల్ ఇచ్చాడు. కానీ ఫీల్డ్ అంపైర్లు మాత్రం క్లారిటీ లేకపోవడంతో థర్డ్ అంపైర్ సమీక్ష కోరారు. థర్డ్ అంపైర్ క్రిస్ గఫెనే పలు కోణాల్లో రిప్లేలను పరిశీలించి సిక్సర్ కాదని తేల్చాడు. కరుణ్ కాలు బౌండరీ లైన్‌కు తాకినట్లు స్పష్టమైన ఆధారాలు లేవని తెలిపాడు.
ఈ ఘటనపై ప్రీతి జింటా ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐపీఎల్ లాంటి హై ప్రొఫైల్ టోర్నమెంట్‌లో థర్డ్ అంపైర్ వద్ద అత్యుత్తమ టెక్నాలజీ ఉన్నా ఇలాంటి తప్పిదాలు చేయడమేంటని ప్రశ్నించారు. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, ఇలాంటి తప్పిదాలు అస్సలు జరగకూడదని నిరాశ వ్యక్తం చేశారు. ఆట తర్వాత కరుణ్‌తో మాట్లాడానని, అతను కూడా అది ఖచ్చితంగా సిక్సర్ అని ధృవీకరించాడని ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు.