
Photo Courtesy: BCCI
ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ ఓపెనింగ్ జోడీ శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ రికార్డు నెలకొల్పింది. నిన్న (ఏప్రిల్ 21) కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ భాగస్వామ్యం (114 పరుగులు) నమోదు చేసిన ఈ జోడీ.. క్యాష్ రిచ్ లీగ్‌లో అత్యధిక ఓపెనింగ్ శతక భాగస్వామ్యాలు (6) నెలకొల్పిన భారత జోడీగా చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌కు ముందు ఈ రికార్డు గిల్-సాయి సుదర్శన్.. కేఎల్ రాహుల్-మయాంక్ అగర్వాల్.. గౌతమ్ గంభీర్-రాబిన్ ఉతప్ప జోడీల పేరిట సంయుక్తంగా ఉండేది.
ఓవరాల్‌గా ఐపీఎల్‌లో అత్యధిక ఓపెనింగ్ శతక భాగస్వామ్యాలు నమోదు చేసిన జోడీగా విరాట్ కోహ్లి-ఏబీ డివిలియర్స్ ద్వయం ఉంది. ఈ జోడీ ఐపీఎల్‌లో 10 సెంచరీ పార్ట్‌నర్‌షిప్స్ నమోదు చేసింది. విరాట్-ఏబీడీ జోడీ తర్వాత అత్యధిక ఓపెనింగ్ శతక భాగస్వామ్యాలు నమోదు చేసిన జోడీగా క్రిస్ గేల్-విరాట్ ద్వయం ఉంది. ఈ జోడీ 9 సెంచరీ పార్ట్‌నర్‌షిప్స్ నమోదు చేసింది.
వీరి తర్వాత గిల్-సాయి సుదర్శన్, శిఖర్ ధవన్-డేవిడ్ వార్నర్, డుప్లెసిస్-విరాట్ ద్వయాలు తలో 6 ఓపెనింగ్ శతక భాగస్వామ్యాలు నమోదు చేసి ఈ జాబితాలో సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాయి. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లోనే గిల్-సాయి సుదర్శన్ జోడీ రెండు శతక భాగస్వామ్యాలు నమోదు చేయడం విశేషం.
ఐపీఎల్‌లో తొలి వికెట్‌కు అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన భారత జోడీలు
సాయి సుదర్శన్-శుభ్‌మన్ గిల్ (గుజరాత్)- 6
కేఎల్ రాహుల్-మయాంక్ అగర్వాల్ (పంజాబ్)-5
గౌతమ్ గంభీర్-రాబిన్ ఉతప్ప (కేకేఆర్)-5
ఓవరాల్‌గా ఐపీఎల్‌లో తొలి వికెట్‌కు అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన జోడీలు
విరాట్ కోహ్లి-ఏబీ డివిలియర్స్ (ఆర్సీబీ)- 10
విరాట్ కోహ్లి-క్రిస్ గేల్ (ఆర్సీబీ)- 9
విరాట్ కోహ్లి- ఫాఫ్ డుప్లెసిస్ (ఆర్సీబీ)-6
శుభ్‌మన్ గిల్- సాయి సుదర్శన్ (గుజరాత్)- 6
శిఖర్ ధవన్- డేవిడ్ వార్నర్ (సన్‌రైజర్స్)- 6
మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో గుజరాత్ కేకేఆర్‌ను 39 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తద్వారా గుజరాత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని పదిలం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. గిల్ (90), సాయి సుదర్శన్ (52), బట్లర్ (41 నాటౌట్) సత్తా చాటడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది.
అనంతరం ఛేదనలో గుజరాత్ బౌలర్లు కలిసికట్టుగా రాణించి కేకేఆర్‌ను 158 పరుగులకే పరిమితం చేశారు. ప్రసిద్ద్, రషీద్ ఖాన్ చెరో 2, సిరాజ్, ఇషాంత్, సుందర్, సాయికిషోర్ తలో వికెట్ తీశారు. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో రహానే ఒక్కడే హాఫ్ సెంచరీతో (50) రాణించాడు. గుజరాత్ ఏప్రిల్ 28న జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడుతుంది.