Rinku Singh: కుటుంబానికి నేనే ఆధారం.. అప్పుడు మా నాన్న 2-3 రోజులు భోజనం చేయలేదు.. కానీ!

IPL 2022: Rinku Singh Father Did Not Eat For 2 3 Days Struggling With Injury - Sakshi

IPL KKR Vs LSG Rinku Singh Comments: ‘‘ఆ ఐదేళ్ల కాలం నా జీవితంలో అత్యంత క్లిష్టమైనది. కేకేఆర్‌ నన్ను కొనుగోలు చేసి.. ఆడే అవకాశం ఇచ్చిన సమయంలో రాణించలేకపోయాను. మొదటి ఏడాది విఫలమైనా సరే నాపై నమ్మకం ఉంచి కేకేఆర్‌ రెండేళ్ల పాటు నన్ను రిటైన్‌ చేసుకుంది’’ అంటూ గత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ యువ ఆటగాడు రింకూ సింగ్‌ ఉద్వేగానికి లోనయ్యాడు.

​కాగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీఘర్‌కు చెందిన రింకూ సింగ్‌ది పేద కుటుంబం. జీవనోపాధి కోసం ఒకానొక సమయంలో స్వీపర్‌గా కూడా పనిచేసిన రింకూ ఒక్కో మెట్టు ఎదుగుతూ క్రికెటర్‌గా తనను తాను నిరూపించుకున్నాడు. దేశవాళీ టోర్నీల్లో ప్రదర్శనతో కేకేఆర్‌ దృష్టిని ఆకర్షించి 2018లో ఐపీఎల్‌లో అడుగుపెట్టాడు. 

అయితే ఆరంభంలో అతడికి పెద్దగా ఆడే అవకాశం రాలేదు. ఐపీఎల్‌-2022లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న 24 ఏళ్ల రింకూ ఆడిన 7 మ్యాచ్‌లలో 174 పరుగులు చేశాడు. జట్టుకు అవసరమైన సమయంలో రాణించి తన విలువను చాటుకున్నాడు. ఇక లక్నో సూపర్‌జెయింట్స్‌తో కీలకమైన ఆఖరి మ్యాచ్‌లోనూ రింకూ బ్యాట్‌ ఝలిపించాడు. కానీ జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. దీంతో 2 పరుగుల తేడాతో ఓటమి పాలై కేకేఆర్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది.

ఈ నేపథ్యంలో రింకూ సింగ్‌ మాట్లాడుతూ తన కుటుంబ నేపథ్యం, ఫ్రాంచైజీతో తన అనుబంధం గురించి చెప్పుకొచ్చాడు. ‘‘గతేడాది విజయ్‌ హజారే ట్రోఫీ సమయంలో పరుగు తీసే క్రమంలో నేను గాయపడ్డాను. అప్పుడు ఐపీఎల్‌ గురించిన ఆలోచనలే నన్ను వెంటాడాయి. నాకు ఆపరేషన్‌ అవసరమని, కోలుకోవడానికి 6 నుంచి 7 నెలల సమయం పడుతుందని వైద్యులు చెప్పారు. ఆటకు అన్ని రోజులు దూరంగా ఉండాలంటే నా వల్ల కాలేదు.

నేను గాయపడటం నాన్నను ఎంతో బాధించింది. ఆయన రెండు మూడు రోజుల పాటు అసలు భోజనం చేయలేదు. క్రికెట్‌లో గాయాలు కామన్‌ అని నాన్నకు చెప్పాను. అయితే, మా కుటుంబం మొత్తం నా మీదే ఆధారపడి ఉంది కదా! మాలాంటి వాళ్ల జీవితాల్లో ఇలాంటివి జరగడం నిజంగా ఆందోళనను రేకెత్తిస్తాయి.

నాన్న అలా ఉండటం చూసి నేను బాధపడ్డాను. అయితే, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి త్వరగానే కోలుకున్నాను’’ అని రింకూ తెలిపాడు. ఆరంభంలో విఫలమైనా కేకేఆర్‌ తనపై నమ్మకం ఉంచి అవకాశాలు ఇచ్చిందని కృతజ్ఞతాభావం చాటుకున్నాడు. ఇక లక్నోతో మ్యాచ్‌లో రింకూ సింగ్‌ విలువైన ఇన్నింగ్స్‌(15 బంతుల్లో 40 పరుగులు) ఆడిన విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

చదవండి👉🏾Shreyas Iyer: ఐపీఎల్‌-2022.. కేకేఆర్‌ అవుట్‌.. నేనేమీ బాధపడటం లేదు: శ్రేయస్‌
చదవండి👉🏾Rinku Singh: చాలా కాలం బెంచ్‌కే పరిమితం.. కానీ ఇప్పుడు సూపర్‌.. భవిష్యత్‌ తనదే: హెడ్‌ కోచ్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top