Virat Kohli: అనవసరంగా ఆటగాళ్లపై ఒత్తిడి పెం‍చడమే: గంభీర్‌

IPL 2021: Gautam Gambhir Criticises Virat Kohli Decision Amidst Tourney RCB Captaincy - Sakshi

Gautam Gambhir Comments On Virat Kohli: రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు సారథి విరాట్‌ కోహ్లి నిర్ణయాన్ని టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ తప్పుబట్టాడు. ఐపీఎల్‌-2021 ముగిసిన తర్వాత కెప్టెన్సీ  నుంచి వైదొలిగే విషయాన్ని అతడు వెల్లడించాల్సిందని అభిప్రాయపడ్డాడు. కాగా వరల్డ్‌కప్‌ తర్వాత టీమిండియా టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్లు ఇటీవల ప్రకటించిన కోహ్లి.. క్యాష్‌ రిచ్‌ లీగ్‌ తాజా సీజన్‌ ముగిసిన తర్వాత ఆర్సీబీ సారథ్య బాధ్యతల నుంచి కూడా వైదొలగుతానని ఆదివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయం ఆర్సీబీ అభిమానులను ఒకింత షాక్‌కు గురిచేసింది. 

ఈ నేపథ్యంలో... 2013లో పూర్తి స్థాయిలో బెంగళూరు కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన కోహ్లి ఒక్కసారి కూడా టైటిల్‌ గెలవకపోవడంతోనే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాడనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, ఈసారి ఆర్సీబీకి గెలిచే చాన్సులు ఎక్కువే ఉన్నాయని, ఇలాంటి సమయంలో కోహ్లి నుంచి ఈ ప్రకటన ఊహించలేదని ఫ్యాన్స్‌ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ విషయంపై స్పందించిన గౌతం గంభీర్‌ సైతం ఇదే తరహా లో వ్యాఖ్యలు చేశాడు. స్టార్‌స్పోర్ట్స్‌తో అతడు మాట్లాడుతూ.. ‘‘కోహ్లి అకస్మాత్తు ప్రకటన నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. 

అందుకు ఇది సరైన సమయం కాదు. రెండో అంచె ప్రారంభానికి ముందు ఇలా చేయడమేమిటి? ఈ ప్రకటన అనవసరంగా ఆటగాళ్లపై ఒత్తిడిని పెంచుతుంది. ఈసారి వాళ్లు మంచి పొజిషన్‌లో ఉన్నారు. విరాట్‌ ఈ సీజన్‌ తర్వాత కెప్టెన్‌గా ఉండడు కాబట్టి ఎలాగైన కప్‌ గెలవాలనే ఆశయం వారిపై అధిక భారాన్ని మోపుతుంది. ఓ వ్యక్తి కోసం కాదు.. ఫ్రాంఛైజీ కోసం టైటిల్‌ గెలవాలి. ఈ విషయాన్ని కోహ్లి గుర్తుపెట్టుకుంటే ఈ సమయంలో ఈ ప్రకటన చేసేవాడు కాదు’’అని విమర్శించాడు.  

‘‘కెప్టెన్‌ పదవి నుంచి వైదొలగడం, ఆటకు గుడ్‌బై చెప్పడం అనేవి రెండు వేర్వేరు నిర్ణయాలు. కోహ్లి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. అయితే,  ఇది ఆటగాళ్లను భావోద్వేగానికి గురిచేసే సమయం. ఏదేమైనా కోహ్లి ఇప్పుడు ఈ ప్రకటన చేయడం అస్సలు సరైనది కాదు’’ అని గంభీర్‌ వ్యాఖ్యానించాడు. ఇక కోహ్లి సారథ్యంలో ఆర్సీబీ 2015లో మూడో స్థానంలోనూ, 2016లో రన్నరప్‌గా, 2020లో నాలుగో స్థానంలోనూ నిలిచిన సంగతి తెలిసిందే. కాగా ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు.. ఐదింటిలో గెలిచి.. పది పాయింట్లతో పట్టికలో మూడోస్థానంలో ఉంది. నేడు(సెప్టెంబరు 20) కోల్‌కతాతో అబుదాబిలో జరిగే మ్యాచ్‌తో రెండో అంచెలో ఆర్సీబీ తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది.

చదవండి: CSK vs MI: గైక్వాడ్‌ అద్భుత ఇన్నింగ్స్‌.. చెన్నైదే పైచేయి

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top