ఎట్టకేలకు కుల్దీప్‌ నవ్వాడు..!

India Vs England 2nd Test Kuldeep Yadav First Wicket After 2 Years - Sakshi

చెన్నై: సుదీర్ఘ నిరీక్షణ అనంతరం తుది జట్టులో చోటు దక్కించుకున్న టీమిండియా బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌ ఎట్టకేలకు ఖాతా తెరిచాడు. మొదటి ఇన్నింగ్స్‌లో పొదుపుగా బౌలింగ్‌ చేసిన ఈ చైనామన్‌ స్పిన్నర్‌.. రెండో ఇన్నింగ్స్‌లో బెన్‌ ఫోక్స్‌ను అవుట్‌ చేశాడు. కుల్దీప్‌ బౌలింగ్‌లో స్వీప్‌ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించిన ఇంగ్లండ్‌ వికెట్‌ కీపర్‌.. అక్షర్‌ పటేల్‌కు క్యాచ్‌ ఇచ్చి 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. తద్వారా ఈ మ్యాచ్‌లో కుల్దీప్‌ పేరిట తొలి వికెట్‌ నమోదైంది. ఆ తర్వాత ధాటిగా ఆడుతూ 18 బంతుల్లో 43 పరుగులు చేసిన ఇంగ్లండ్‌ బౌలర్‌ మెయిన్‌ అలీని పెవలియన్‌కు పంపి మరో వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు.

కాగా ఆస్ట్రేలియాతో రెండేళ్ల క్రితం జరిగిన టెస్టు సిరీస్‌లో చివరిసారిగా టెస్టు క్రికెట్‌ ఆడిన కుల్దీప్‌.. సిడ్నీలో జరిగిన నాలుగో మ్యాచ్‌లో 5 వికెట్లు కూల్చి సత్తా చాటాడు. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా ఈ గణంకాలు నమోదు చేసి, డ్రాగా ముగిసిన ఈ టెస్టులో తన వంతు పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి టీమిండియా టెస్టు స్క్వాడ్‌లో చోటు దక్కించుకుంటున్న అతడు, బెంచ్‌కే పరిమితం అయ్యాడు. బీసీసీఐ ప్రకటించిన 13 టెస్టు మ్యాచ్‌ ప్రాబబుల్స్‌లో కుల్దీప్‌కు చోటు దక్కినా ఆడే అవకాశం మాత్రం రాలేదు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరుగుతున్నమొదటి టెస్టులో అతడిని ఆడిస్తారని భావించినా, షాబాజ్‌ నదీంను తుది జట్టులోకి తీసుకున్నారు. దీంతో మరోసారి కుల్దీప్‌కు నిరాశే ఎదురైంది.

ఇక ఎట్టకేలకు రెండో టెస్టు తుది జట్టులో అతడి పేరును చేర్చడంతో సుదీర్ఘ నిరీక్షణకు తెరపడినట్లయింది. ఈ క్రమంలో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా.. 6 ఓవర్లు వేసిన కుల్దీప్‌, 16 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మంగళవారం నాటి రెండో ఇన్నింగ్స్‌లో లంచ్‌బ్రేక్‌ సమయానికి 3.3 ఓవర్లు వేసి ఏడు పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ పడగొట్టాడు. దీంతో అతడి ముఖంపై చిరునవ్వు విరిసింది. ఆ తర్వాత మొయిన్‌ అలీ వికెట్‌ పడగొట్టాడు. మొత్తంగా ఈ ఇన్నింగ్స్‌లో 6.2 ఓవర్లు వేసిన కుల్దీప్‌.. 25 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. 482 పరుగుల భారీ లక్ష్యంతో మైదానంలో దిగిన ఇంగ్లండ్‌ భోజన విరామానికి ముందు ఏడు వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది. అనంతరం మొయిన్‌ అలీ అద్భుత ఇన్నింగ్స్‌తో ఎట్టకేలకు గౌరవప్రదమైన స్కోరు చేసి 164 పరుగులకు ఆలౌట్‌ అయింది. అక్షర్‌ పటేల్‌ 5, అశ్విన్‌ 3, కుల్దీప్‌ యాదవ్‌ 2 వికెట్లు‌ తమ ఖాతాలో వేసుకున్నారు.

చదవండి‘ఏంటి కోహ్లి.. మరీ అంత పనికిరాని వాడినా’
చదవండి'ఇప్పటికైనా అతనికి అవకాశం ఇవ్వండి'

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top