
నేడు ‘సూపర్–4’ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో ‘ఢీ’
రాత్రి 8 గంటల నుంచి సోనీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
దుబాయ్: ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నీలో భారత జట్టు అలవోక విజయాలతో దూసుకెళుతోంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో సైతం ఎలాంటి పోటీ ఎదురవలేదు. లీగ్ దశ, సూపర్–4లోనూ పాక్‌పై టీమిండియా దాదాపు ఏకపక్ష విజయాల్నే సాధించింది. ఇపుడు బంగ్లాదేశ్ వంతు వచ్చింది. భారత్ ప్రస్తుతమున్న ఫామ్‌కు, జోరుకు బంగ్లాదేశ్ బ్రేక్ వేయడం అసాధ్యమనుకోవాలి.
అయితే ఫలితాన్ని పక్కనబెట్టి పోటీ ఏమాత్రం ఇస్తుందనేదే వేచి చూడాలి. మరోవైపు ‘సూపర్–4’లో శ్రీలంకను ఓడించిన బంగ్లాదేశ్ కూడా రెట్టించిన ఉత్సాహంతో దుర్బేధ్యమైన భారత్‌తో తలపడేందుకు సిద్ధమైంది. ‘సూపర్–4’లో బోణీ కొట్టిన ఇరు జట్ల మధ్య ఈ పోరు జరుగుతుండటంతో పైచేయి సాధించేందుకు భారత్ తహతహలాడుతోంది.
ఆల్‌రౌండ్ సత్తాతో...
బ్యాటింగ్, బౌలింగ్‌లో టీమిండియా ఆటగాళ్లకు ఎదురేలేదు. పాక్‌తో గత మ్యాచ్‌లో ఫీల్డింగ్ లోపాలు మినహా ఏ విభాగంలో మెరుగవ్వాల్సిన అవసరమైతే లేనేలేదు. బాల్య మిత్ర ద్వయం శుబ్‌మన్, అభిషేక్ శర్మలు అలవోకగా పరుగులు బాదేస్తున్నారు. సారథి సూర్యకుమార్, తిలక్ వర్మ, సంజూ సామ్సన్, హార్దిక్ పాండ్యాల నుంచి శివమ్ దూబే, ఎనిమిదో స్థానంలో అక్షర్ పటేల్ వరకు పరుగులు సాధించగలరు.
ఇక బౌలింగ్‌లో భారత్ స్పిన్‌కు ప్రత్యర్థులే చిత్తవుతున్నారు. కుల్దీప్, వరుణ్, అక్షర్‌లతో పాటు పార్ట్ టైమ్ బౌలర్ దూబే కూడా ప్రత్యర్థి బ్యాటర్ల పనిపడుతున్నాడు. ఇలా అన్ని విభాగాల్లోనూ అగ్రశ్రేణిగా ఉన్న టీమిండియాను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎదుర్కోవడం ముమ్మాటికి కష్టమనే చెప్పాలి. దీంతో ఈ టోర్నీలో భారత్‌కు వరుసగా ఐదో విజయం ఏమంత కష్టం కానేకాదు!
సర్వశక్తులు ఒడ్డినా...
టి20ల్లో అజేయమైన శక్తిగా ఎదిగిన భారత్‌ను ఓడించడం బంగ్లాదేశ్ లాంటి జట్లకైతే అసాధ్యం. సర్వశక్తులు ఒడ్డినా సరే పాక్ కంటే మెరుగైన పోటీ ఇవ్వగలదేమో కానీ గెలుపుపై మాత్రం ఆశలైతే పెట్టుకోలేదు. బ్యాటింగ్‌లో టాపార్డర్ బ్యాటర్లు సైఫ్ హసన్, తంజిద్ హసన్, కెప్టెన్ లిటన్ దాస్‌లు రాణిస్తున్నారు.
తౌహిద్ హృదయ్, షమీమ్ హొస్సేన్, జాకిర్ అలీలు మిడిలార్డర్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వగలరు. ఇక బౌలింగ్‌లో ముస్తఫిజుర్ కీలకం. మెహదీ హసన్, షోరిఫుల్ ఇస్లామ్, నసుమ్ అహ్మద్‌లు కూడా పిచ్ సహకరిస్తే ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలరు.
16 భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఇప్పటివరకు 17 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు జరిగాయి. 16 మ్యాచ్‌ల్లో భారత్ గెలుపొందగా... ఒక్క మ్యాచ్‌లో మాత్రమే బంగ్లాదేశ్ నెగ్గింది. 2019లో ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్‌పై బంగ్లాదేశ్ ఏకైక విజయాన్ని అందుకుంది.