డోపింగ్‌ అనర్హుల జాబితాలో భారత్‌ ‘టాప్‌’ | India tops doping disqualification list | Sakshi
Sakshi News home page

డోపింగ్‌ అనర్హుల జాబితాలో భారత్‌ ‘టాప్‌’

Apr 4 2026 4:14 AM | Updated on Apr 4 2026 4:14 AM

India tops doping disqualification list

148 మంది అథ్లెట్లపై అనర్హత వేటు  

న్యూఢిల్లీ: డోపింగ్‌ ఉల్లంఘనల్లో భారత్‌ చెత్త రికార్డు మూటగట్టుకుంది. గతంలో అథ్లెటిక్స్‌ ఇంటిగ్రిటీ యూనిట్స్‌ (ఏఐయూ) అనర్హులైన అథ్లెట్ల జాబితాలో కెన్యా అగ్రస్థానంలో ఉండగా... తాజా నివేదికలో కెన్యాను అధిగమించి భారత్‌ తొలి స్థానానికి చేరింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నాటికి మన దేశానికి చెందిన 148 మంది ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ అథ్లెట్లు డోపింగ్‌ ఉల్లంఘనలకు పాల్పడి నిషేధం ఎదుర్కొంటున్నారు. కెన్యా (146 మంది అథ్లెట్లు), రష్యా (66 మంది అథ్లెట్లు) వరుసగా రెండో, మూడో స్థానాల్లో ఉన్నాయి. 

ఈ జాబితాలో మహిళల 100 మీటర్ల జాతీయ రికార్డు హోల్డర్‌ ద్యుతీ చంద్, మిడిల్‌ డిస్టాన్స్‌ రన్నర్‌ పర్వేజ్‌ ఖాన్, తమిళనాడు స్పింటర్‌ శేఖర్‌ ధనలక్ష్మి ఉన్నారు. ద్యుతీ చంద్‌పై 2022 డిసెంబర్‌లో నాలుగు సంవత్సరాల నిషేధం పడగా... పర్వేజ్‌పై విధించిన నిషేధం జూలై 2030 వరకు కొనసాగనుంది. ప్రపంచ అథ్లెటిక్స్‌ సమాఖ్య ఆధ్వర్యంలో స్వతంత్రంగా పనిచేసే ఏఐయూ అన్నీ దేశాల డోపింగ్‌ వివరాలు సేకరిస్తుంది. డోపింగ్‌ను రూపుమాపాలని కంకణం కట్టుకున్న భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) దీనితో సంబంధం ఉన్న కేంద్రాలను గుర్తించడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటోంది. 

అథ్లెట్లు డోపింగ్‌కు పాల్పడటం వెనక శిక్షకుల హస్తం కూడా ఉంటుందని భావిస్తున్న ఏఎఫ్‌ఐ... కోచ్‌లందరూ తమ వద్ద పేరు నమోదు చేసుకోవాలని కోరింది. ఏఎఫ్‌ఐలో నమోదు చేసుకోని కోచ్‌లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడంతో పాటు... వారి వద్ద శిక్షణ తీసుకున్న వారిని జాతీయ అవార్డులకు అనర్హులుగా ప్రకటించింది. 2024 పారిస్‌ ఒలింపిక్స్‌ తర్వాత ఏఎఫ్‌ఐ జాతీయ శిబిరాలను వికేంద్రీకరించింది. ప్రస్తుతం రిలే జట్లకు మాత్రమే నేషనల్‌ క్యాంప్‌లు నిర్వహిస్తోంది. మిగిలిన అగ్రశ్రేణి అథ్లెట్లందరూ రిలయన్స్, జేఎస్‌డబ్ల్యూ, టాటా వంటి ప్రైవేటు సంస్థలు... ఆర్మీ, నేవీ వంటి ప్రభుత్వ విభాగాల పర్యవేక్షణలో శిక్షణ పొందుతున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement