ముంబై: భారత క్రికెట్ జట్టు ఈ ఏడాది మూడు ఫార్మాట్‌లలో సిరీస్‌లు ఆడేందుకు న్యూజిలాండ్‌లో పర్యటించనున్న నేపథ్యంలో... అంతకుముందు భారత ‘ఎ’ జట్టు కివీస్ టూర్‌కు వెళ్లనుంది. భారత్, న్యూజిలాండ్ మధ్య నవంబర్ 19 నుంచి రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు అర్హత సాధించాలంటే టీమిండియాకు ఈ సిరీస్ ఫలితం కీలకం కానుంది. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితులపై అవగాహన పెంచుకునేందుకు భారత ‘ఎ’ పర్యటన ఉపయోగపడనుంది.
ఇందులో భాగంగా మూడు అనధికారిక టెస్టులు జరగనున్నాయి. క్రైస్ట్‌చర్చ్ వేదికగా అక్టోబర్ 24న నాలుగు రోజుల తొలి అనధికారిక టెస్టు ప్రారంభం కానుంది. ఈ మేరకు న్యూజిలాండ్ క్రికెట్ మంగళవారం వివరాలు వెల్లడించింది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమిండియా ప్రస్తుతం ఐదో ర్యాంక్‌లో ఉండగా... న్యూజిలాండ్ మూడో ‘ప్లేస్’లో కొనసాగుతోంది. 2024–25 భారత పర్యటనలో భాగంగా న్యూజిలాండ్ జట్టు 3–0తో టెస్టు సిరీస్ విజయం సాధించింది.


