టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ప్రకటన | BCCI Announces Women Team For ICC T20 World Cup 2026 | Sakshi
Sakshi News home page

టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ప్రకటన

May 2 2026 5:33 PM | Updated on May 2 2026 6:15 PM

BCCI Announces Women Team For ICC T20 World Cup 2026

ఐసీసీ మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు సంబంధించి బీసీసీఐ శ‌నివారం భారత జ‌ట్టును ప్ర‌క‌టించింది. అమితా శ‌ర్మ నేతృత్వంలోని సెలెక్ష‌న్ క‌మిటీ, బీసీసీఐ కార్య‌ద‌ర్శి దేవ్‌జిత్ సైకియా, మ‌హిళల జ‌ట్టు ప్ర‌ధాన కోచ్ అమోల్ మ‌జుందార్‌, కెప్టెన్ హర్మ‌న్‌ప్రీత్ కౌర్‌ల‌తో స‌మావేశ‌మైంది. సుదీర్ఘ చ‌ర్చ అనంత‌రం భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించారు.

హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్ రికార్డు స్థాయిలో ఐదోసారి కెప్టెన్‌గా జ‌ట్టును న‌డిపించ‌నుండ‌డం విశేషం. కెప్టెన్ హ‌ర్మ‌న్‌ప్రీత్‌, స్మృతి మంధాన‌, జేమీమా రోడ్రిగ్స్‌, ష‌ఫాలీ వ‌ర్మ‌, రిచా ఘోష్‌లు బ్యాటింగ్ భారాన్ని మోయ‌నున్నారు. ఇక ఆల్‌రౌండ‌ర్ దీప్తి శ‌ర్మ‌, రేణుకాసింగ్‌లు బౌలింగ్ ద‌ళాన్ని ముందుండి నడిపించ‌నున్నారు. 

తెలుగు క్రికెట‌ర్లు శ్రీచ‌ర‌ణి, అరుంధ‌తి రెడ్డి జ‌ట్టులో చోటు ద‌క్కించుకున్నారు. ఇక గాయం కార‌ణంగా దూర‌మైన అమ‌న్‌జ్యోత్ కౌర్ స్థానంలో భార‌తి పుల్మాలిని ఎంపిక చేసిన‌ట్లు సెలెక్ష‌న్ క‌మిటీ ప్ర‌క‌టించింది. బ్యాట‌ర్ హ‌ర్లీన్ డియోల్‌, స్పిన్న‌ర్ స్నేహ్‌రాణాలకు జ‌ట్టులో చోటు ద‌క్క‌లేదు.

15 మందితో కూడిన జ‌ట్టుకు హర్మ‌న్‌ప్రీత్ కౌర్ నాయ‌కత్వం వ‌హించ‌నున్నారు. జూన్‌ 12 నుంచి ఇంగ్లండ్‌ వేదికగా టీ20 ప్రపంచకప్‌ జరగనుంది. గ్రూప్‌-ఏలో భారత్‌తో పాటు పాకిస్తాన్‌, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌, నెదర్లాండ్స్‌, దక్షిణాఫ్రికా ఉన్నాయి. టీమిండియా తమ తొలి మ్యాచ్‌ను జూన్ 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆడనుంది.

ఆ తర్వాత 17న నెదర్లాండ్స్‌, 21న సౌతాఫ్రికా, 25న బంగ్లాదేశ్‌, 28న ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఇక గ్రూప్‌-బిలో న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌, శ్రీలంక, స్కాట్లాండ్‌, ఐర్లాండ్ ఉన్నాయి. కాగా జూన్ 30న తొలి సెమీఫైనల్‌, జూలై 2న రెండో సెమీఫైనల్ జరగనున్నాయి. ఇక జూలై 5న జరగనున్న ఫైనల్ మ్యాచ్‌కు లార్డ్స్ ఆతిథ్యమివ్వనుంది.

ఇక గతేడాది భారత్‌ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. హర్మన్‌ప్రీత్‌ నేతృత్వంలోని టీమిండియా ఆనాటి ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి తొలిసారి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడింది.

భారత్‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌ వివరాలు..
జూన్‌ 14: భారత్‌ వర్సెస్‌ పాకిస్తాన్‌, వేదిక: ఎడ్జ్‌బాస్టన్‌
జూన్‌ 17: భారత్‌ వర్సెస్‌ నెదర్లాండ్స్‌, వేదిక: హెడ్డింగే
జూన్‌ 21: భారత్‌ వర్సెస్‌ దక్షిణాఫ్రికా, వేదిక: ఓల్డ్‌  ట్రాఫోర్డ్‌
జూన్‌ 25: భారత్‌ వర్సెస్‌ బంగ్లాదేశ్‌, వేదిక: ఓల్డ్‌  ట్రాఫోర్డ్‌
జూన్‌ 28: భారత్‌ వర్సెస్‌ ఆస్ట్రేలియా, వేదిక: లార్డ్స్‌

భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, భారతీ ఫుల్మాలి, దీప్తి శర్మ, రిచా ఘోష్, శ్రీ చరణి, యాస్తికా భాటియా, నందనీ శర్మ, అరుంధతీ రెడ్డి, రేణుకా సింగ్, క్రాంతి గౌడ్, శ్రేయాంక పాటిల్‌, రాధా యాద‌వ్‌.

 చదవండి: ఒక్క హగ్‌కు ఇంత రాద్ధాంతమా!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement