భళా భారత్‌... | Sakshi
Sakshi News home page

భళా భారత్‌...

Published Thu, Oct 5 2023 1:31 AM

India registered the best performance in the history of Asian Games - Sakshi

పతకాల్లో తొలిసారి ‘సెంచరీ’ దాటాలనే లక్ష్యంతో చైనా గడ్డపై అడుగుపెట్టిన భారత క్రీడా బృందం ఈ క్రమంలో ఆసియా క్రీడల చరిత్రలోనే తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. ఈ క్రీడలు ముగియడానికి మరో నాలుగు రోజులు ఉండగా... ఇప్పటికే భారత్‌ ఖాతాలో 81 పతకాలు చేరాయి. 2018 జకార్తా ఆసియా క్రీడల్లో భారత్‌ అత్యధికంగా 70 పతకాలు సాధించింది.

పోటీల 11వ రోజు భారత్‌ మూడు స్వర్ణాలు, ఐదు రజతాలు, నాలుగు కాంస్యాలతో కలిపి 12 పతకాలు సొంతం చేసుకుంది. మారథాన్‌ రేసుతో నేడు అథ్లెటిక్స్‌ ఈవెంట్స్‌కు తెరపడనున్న నేపథ్యంలో... ఆర్చరీ, క్రికెట్, రెజ్లింగ్, బ్యాడ్మింటన్, స్క్వా‹ష్, బ్రిడ్జ్, చెస్‌ క్రీడాంశాల్లో భారత్‌ ఎన్ని పతకాలు సాధిస్తుందో వేచి చూడాలి.   

హాంగ్జౌ: భారత అథ్లెటిక్స్‌ ‘పోస్టర్‌ బాయ్‌’ నీరజ్‌ చోప్రా ఆసియా క్రీడల్లో పసిడి పతకంతో మెరిశాడు. సహచరుడు కిశోర్‌ కుమార్‌ జేనా నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురుకావడంతో నీరజ్‌ చోప్రా నుంచి ఈ సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శన బయటకు వచ్చింది. బుధవారం జరిగిన పురుషుల జావెలిన్‌ త్రో ఈవెంట్‌లో స్వర్ణ, రజత పతకాలు భారత్‌ ఖాతాలోకి వెళ్లాయి. డిఫెండింగ్‌ చాంపియన్‌ నీరజ్‌ చోప్రా నాలుగో ప్రయత్నంలో జావెలిన్‌ను 88.88 మీటర్ల దూరం విసిరి పసిడి పతకాన్ని ఖాయం చేసుకున్నాడు.

కిశోర్‌ కుమార్‌ జేనా జావెలిన్‌ను తన మూడోప్రయత్నంలో 86.77 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానానికి వచ్చాడు. అయితే నీరజ్‌ చోప్రా తన నాలుగో ప్రయత్నంలో జావెలిన్‌ను 88.88 మీటర్ల దూరం విసిరి ఈ సీజన్‌లో తన అత్యుత్తమ త్రో నమోదు చేశాడు. అంతేకాకుండా స్వర్ణ పతకాన్ని ఖరారు చేసుకున్నాడు. కిశోర్‌ నాలుగో ప్రయత్నంలో జావెలిన్‌ను 87.54 మీటర్ల దూరం విసిరి పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత పొందినా నీరజ్‌ దూరాన్ని దాటలేకపోయాడు. తర్వాతి రెండు ప్రయత్నాల్లో కిశోర్‌ ఫౌల్‌ చేసి పాల్గొన్న తొలి ఆసియా క్రీడల్లోనే రజత పతకం గెలిచి సంబరపడ్డాడు.

మరోవైపు ఈ ప్రదర్శనతో నీరజ్‌ వరుసగా రెండు ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు గెలిచిన రెండో జావెలిన్‌ త్రోయర్‌గా గుర్తింపు పొందాడు. గతంలో పాకిస్తాన్‌కు చెందిన మొహమ్మద్‌ నవాజ్‌ (1951, 1954) ఈ ఘనత సాధించాడు. రజత పతకం నెగ్గిన ఒడిశా ప్లేయర్‌ కిశోర్‌ కుమార్‌కు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ రూ. ఒక కోటీ 50 లక్షలు నజరానా ప్రకటించారు. 

61 ఏళ్ల తర్వాత రిలేలో స్వర్ణం 
పురుషుల 4్ఠ400 మీటర్ల రిలే ఈవెంట్‌లో మొహమ్మద్‌ అనస్, అమోజ్‌ జేకబ్, అజ్మల్, రాజేశ్‌ రమేశ్‌లతో కూడిన భారత బృందం స్వర్ణ పతకం గెలిచింది. భారత బృందం 3ని:01.58 సెకన్లలో అందరికంటే వేగంగా గమ్యానికి చేరి ఈ విభాగంలో 61 ఏళ్ల తర్వాత భారత్‌కు మళ్లీ పసిడి పతకాన్ని అందించింది. 1962 ఆసియా క్రీడల్లో మిల్కా సింగ్, మఖన్‌ సింగ్, దల్జీత్‌ సింగ్, జగదీశ్‌ సింగ్‌ బృందం చివరిసారి 4్ఠ400 మీటర్ల రిలేలో భారత్‌కు బంగారు పతకాన్ని అందించింది.

మరోవైపు ఐశ్వర్య మిశ్రా, శుభ వెంకటేశ్, ప్రాచీ, విత్యా రామ్‌రాజ్‌లతో కూడిన భారత మహిళల జట్టు 4్ఠ400 మీటర్ల రిలేలో రజత పతకంతో (3ని:27.85 సెకన్లు) సరిపెట్టుకుంది. పురుషుల 5000 మీటర్ల విభాగంలో అవినాశ్‌ సాబ్లే (13ని:21.09 సెకన్లు) రజత పతకం గెలిచాడు. మహిళల 800 మీటర్ల ఫైనల్‌ రేసును భారత అథ్లెట్‌ హర్‌మిలన్‌ బైన్స్‌ 2ని:03.75 సెకన్లలో పూర్తి చేసి రజత పతకంకైవసం చేసుకుంది. 35 కిలోమీటర్ల నడక మిక్స్‌డ్‌ విభాగంలో మంజు రాణి, రాంబాబు జోడీ భారత్‌కు కాంస్య పతకాన్ని అందించింది.  

సురేఖ–ఓజస్‌ జోడీకి స్వర్ణం 
ఆర్చరీ కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ విభాగంలో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ–ఓజస్‌ ప్రవీణ్‌ దేవ్‌తలే (భారత్‌) జోడీ స్వర్ణ పతకాన్ని సాధించింది. ఫైనల్లో జ్యోతి సురేఖ–ఓజస్‌ ప్రవీణ్‌ జంట 159–158తో సో చేవన్‌–జేహూన్‌ జూ (దక్షిణ కొరియా) ద్వయంపై గెలిచింది.

అంతకుముందు సురేఖ–ఓజస్‌ సెమీఫైనల్లో 159–154తో కజకిస్తాన్‌ జోడీపై, క్వార్టర్‌ ఫైనల్లో 158–155తో మలేసియా జంటపై విజయం సాధించింది. మరోవైపు బ్రిడ్జ్‌ క్రీడాంశంలో పురుషుల టీమ్‌ విభాగంలో భారత జట్టు ఫైనల్‌కు చేరి కనీసం రజత పతకాన్ని ఖాయం చేసుకోగా... చెస్‌లో భారత పురుషుల, మహిళల జట్లు రెండో స్థానంలో కొనసాగుతూ పతకాల రేసులో ఉన్నాయి.  

Advertisement
Advertisement