
టీమిండియా విధ్వంసకర బ్యాటర్ రింకూ సింగ్ ఎంగేజ్‌మెంట్ ఇవాళ (జూన్ 8) లక్నోలోని ద సెంట్రమ్ ఫైవ్ స్టార్ హోటల్‌లో ఘనంగా జరిగింది. రింకూ సమాజ్‌వాది పార్టీ ఎంపీ (లోక్‌సభ) ప్రియా సరోజ్‌ను నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో రింకూ, సరోజ్ నిశ్చితార్థం రింగులు మార్చుకున్నారు. ఈ వేడుకకు రింకూ, సరోజ్ కుటుంబ సభ్యులతో పాటు క్రికెట్, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
Rinku Singh got engaged with Priya Saroj. 💍 ❤️
- Congratulations to both of them. pic.twitter.com/hj8aAslurI— Johns. (@CricCrazyJohns) June 8, 2025
తెలుపు, పింక్ కలర్ ఔట్ ఫిట్‌లలో రింకూ, సరోజ్ జోడీ చూడముచ్చటగా ఉంది. ఈ వేడుకకు యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, అతని భార్య డింపుల్ యాదవ్, బిగ్‌బీ సతీమణి, సమాజ్‌వాది పార్టీ ఎంపీ జయా బచ్చన్, సమాజ్‌వాది పార్టీ సీనియర్ లీడర్ ప్రొఫెసర్ రామ్‌గోపాల్ యాదవ్, ఇక్రా హసన్ (సరోజ్ క్లోజ్ ఫ్రెండ్), బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, ఉత్తర్‌ప్రదేశ్ మాజీ క్రికెటర్లు ప్రవీణ్ కుమార్, పియుశ్ చావ్లా, ఉత్తర్‌ప్రదేశ్ రంజీ జట్టు కెప్టెన్ ఆర్యన్ జుయల్ తదితరులు హాజరయ్యారు. వేడుక అనంతరం అతిథులకు దేశీయ విందుతో పాటు యురోపియన్ వంటాలను వడ్డించారు. ఎంగేజ్‌మెంట్ వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.

27 ఏళ్ల రింకూ ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2025 సీజన్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ సీజన్‌లో అతను 29.42 సగటున, 153.73 స్ట్రయిక్‌రేట్‌తో 206 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సీజన్‌లో అతను ప్రాతినిథ్యం వహించిన కేకేఆర్ పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో నిలిచింది. ఆ జట్టు 14 మ్యాచ్‌ల్లో కేవలం ఐదింట మాత్రమే గెలుపొందింది. రింకూ అంతర్జాతీయ కెరీర్ విషయానికొస్తే.. భారత్ తరఫున 33 టీ20లు, రెండు వన్డేలు ఆడాడు. ఇందులో 3 అర్ద సెంచరీల సాయంతో 601 పరుగులు చేశాడు.
సరోజ్ విషయానికొస్తే.. 26 ఏళ్ల సరోజ్ ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌లోని మచ్లిషెహర్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు. 2024 జనరల్ ఎలెక్షన్స్‌లో ప్రియా సిట్టింగ్ బీజేపీ ఎంపీ బీపీ సరోజ్‌పై 35000 ఓట్ల తేడాతో గెలుపొందింది. ప్రియాకు ఇవే తొలి ఎన్నికలు.
వారణాసికి చెందిన సరోజ్ పాలిటిక్స్‌లోకి రాక ముందు 'లా'లో బ్యాచ్‌లర్ డిగ్రీ పొందారు. సరోజ్ తన ఉన్నత చదువులను ఢిల్లీలో పూర్తి చేశారు. సరోజ్ తండ్రి తూఫానీ సరోజ్ మూడు సార్లు ఎంపీగా పని చేశారు. ప్రస్తుతం అతను జౌన్‌పూర్ జిల్లాలోని కేరాకట్ అసెంబ్లీ స్థానం నుంచి సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు.