
ఇంగ్లండ్ అండర్ 19 జట్టుతో జరుగుతున్న రెండో యూత్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో భారత యువ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ ఘోరంగా విఫలమయ్యాడు. ఎదుర్కొన్న తొలి బంతికే అలెక్స్ గ్రీన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డై గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో కూడా వైభవ్ నిరాశపరిచాడు. కేవలం 20 పరుగులకే ఔటయ్యాడు.
ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్‌లో కూడా వైభవ్ ఓ మోస్తరు ప్రదర్శనలకే పరిమితమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 14 పరుగులే చేసి నిరాశపరిచిన వైభవ్.. రెండో ఇన్నింగ్స్‌లో అర్ద సెంచరీ చేసి పర్వాలేదనిపించాడు. టెస్ట్ సిరీస్‌లో వైభవ్‌పై భారీ అంచనాలు ఉండటానికి కారణం అంతకుముందు ఇంగ్లండ్‌తోనే జరిగిన ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్.
ఆ సిరీస్‌లో వైభవ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తొలి మ్యాచ్‌లో 19 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 48 పరుగులు చేసిన వైభవ్.. రెండో వన్డేలో 34 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 45 పరుగులు.. మూడో వన్డేలో 31 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 86 పరుగులు.. నాలుగో వన్డేలో 78 బంతుల్లో 13 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో ఏకంగా 143 పరుగులు చేశాడు. చివరి వన్డేలో శాంతించిన వైభవ్.. ఓ మోస్తరు ఇన్నింగ్స్‌తో (42 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 33 పరుగులు) సరిపెట్టాడు.
వైభవ్ విధ్వంసకర ఇన్నింగ్స్‌ల ధాటికి భారత్ ఇంగ్లండ్‌ను వారి సొంతగడ్డపై 3-2 తేడాతో ఓడించి సిరీస్ కైవసం చేసుకుంది. వైభవ్ వన్డేల్లో ప్రదర్శించిన జోరును కొనసాగిస్తాడని అనుకుంటే మమ అనిపించి నిరాశపరిచాడు.
టెస్ట్ సిరీస్ విషయానికొస్తే.. తొలి టెస్ట్ డ్రా కాగా.. రెండో టెస్ట్‌లో ఇవాళ (జులై 23) చివరి రోజు ఆట కొనసాగుతుంది. టీ విరామం సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. వైభవ్ గోల్డెన్ డకౌటై నిరాశపరిచినా కెప్టెన్ ఆయుశ్ మాత్రే అజేయ అర్ద సెంచరీతో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా అభిగ్యాన్ కుందు (19) క్రీజ్‌లో ఉన్నాడు.
ఈ మ్యాచ్‌లో భారత్ 355 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే మరో 223 పరుగులు చేయాలి. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి.
స్కోర్ వివరాలు..
ఇంగ్లండ్ అండర్-19: 309 (ఎకాన్ష్ సింగ్ 117) & 324/5 (డాకిన్స్ 136)
భారత్ అండర్-19: 279 (విహాన్ మల్హోత్రా 120) & 131/2 (ఆయుశ్ మాత్రే 80 నాటౌట్)