
న్యూఢిల్లీ: 2036లో ఒలింపిక్స్‌ను నిర్వహించాలని ఆసక్తి కనబరుస్తున్న భారత్ ఈ దిశగా తమ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఒలింపిక్ నిర్వహణా హక్కుల ప్రక్రియలో భాగంగా రెండో దశలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)తో తాము ‘నిరంతర చర్చలు’ కొనసాగుతున్నాయని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు.
పార్లమెంట్‌లో ఆప్ పార్టీ ఎంపీ గురీ్మత్ సింగ్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయన ఈ వివరాలు వెల్లడించారు. ‘ఒలింపిక్స్ నిర్వహణ బిడ్డింగ్ ప్రక్రియను పూర్తిగా భారత ఒలింపిక్ సంఘం పర్యవేక్షిస్తోంది. ఇప్పటికే తమ ఆసక్తిని కనబరుస్తూ ఐఓసీకి లెటర్ ఆఫ్ ఇన్‌టెంట్‌ను ఐఓఏ ఇచ్చింది. దీనిపై ఐఓసీలో భాగమైన ఆతిథ్య కమిషన్‌తో సంప్రదింపులు సాగుతున్నాయి.
అయితే ఒకవేళ భారత్‌కు క్రీడలను కేటాయిస్తే వేదికలు ఏమిటనే విషయంపై ఇప్పుడే చర్చ అవసరం. మన దేశానికి ఒలింపిక్స్‌ను కేటాయించడమే అన్నింటికంటే ముఖ్యం’ అని మంత్రి స్పష్టం చేశారు. ఒలింపిక్స్ హక్కుల కేటాయింపులో రెండో దశ అయిన ‘కంటిన్యూయస్ డైలాగ్’లో బిడ్ వేసిన ఆయా దేశాల సన్నద్ధత, ఆర్ధిక పరిస్థితి, ఆ దేశంలో సాధ్యాసాధ్యాలపై ఐఓసీ ఒక అంచనాకు వస్తుంది.
2036 క్రీడల కోసం భారత్‌తో పాటు ఖతర్, టర్కీ కూడా పోటీ పడుతున్నాయి. అయితే ప్రస్తుతానికి ఈ దశను ఐఓసీ నిలిపివేయడం గమనార్హం! ప్రస్తుత ఐఓసీ అధ్యక్షురాలు కిర్‌స్టీ కొవెంట్రీ స్వయంగా ఈ విషయాన్ని చెప్పింది. ‘2028, 2032 క్రీడలతో పాటు 2030లో జరిగే వింటర్ గేమ్ ఆతిథ్య హక్కులు కూడా వరుసగా లాస్ ఏంజెలిస్, బ్రిస్బేన్, ఫ్రెంచ్ ఆల్ప్స్‌కు ఇప్పటికే ఇచ్చేశాం.
ముందు వీటి నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు, ఇతర అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉంది. ఇలాంటి స్థితిలో 2036 క్రీడల కేటాయింపు గురించి ఆలోచించడం అనవసరం. అందుకే డైలాగ్ ప్రక్రియను ఆపేస్తున్నాం. ఐఓసీ సభ్యులందరూ దీనికి మద్దతు పలికారు’ అని గత నెలలో కొవెంట్రీ స్పష్టం చేసింది.
మరోవైపు భారత్‌లో ఫుట్‌బాల్ అధ్వాహ్న పరిస్థితిపై అడిగిన ప్రశ్నకు మాండవీయ సమాధానిస్తూ... ‘ఈ విషయంలో భారత ఫుట్‌బాల్ సమాఖ్యదే పూర్తి బాధ్యత. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సూచన ప్రకారం వారు అన్ని అంశాలు పర్యవేక్షిస్తున్నారు. ప్రపంచ ర్యాంకింగ్స్ ఎన్నో అంశాలపై ఆధారపడి ఉంటాయి కాబట్టి దానికి అంత ప్రాధాన్యత ఇవ్వనవసరం లేదు’ అని చెప్పారు.