ఆసియా క్రీడలకు సురేఖ, చికిత, ధీరజ్, గణేశ్‌ | India Archery squads for Asian Games 2026 | Sakshi
Sakshi News home page

ఆసియా క్రీడలకు సురేఖ, చికిత, ధీరజ్, గణేశ్‌

May 19 2026 5:41 AM | Updated on May 19 2026 5:41 AM

India Archery squads for Asian Games 2026

సోనీపత్‌ (హరియాణా): ఈ ఏడాది సెప్టెంబర్‌–అక్టోబర్‌లలో జపాన్‌ వేదికగా జరిగే ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత ఆర్చరీ జట్లను ప్రకటించారు. మహిళల కాంపౌండ్‌ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ స్టార్‌ వెన్నం జ్యోతి సురేఖ... తెలంగాణ అమ్మాయి తనిపర్తి చికిత.. పురుషుల రికర్వ్‌ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్‌ బొమ్మదేవర ధీరజ్‌... పురుషుల కాంపౌండ్‌ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన తిరుమూరు గణేశ్‌ మణిరత్నం భారత జట్టులోకి ఎంపికయ్యారు. 

మూడు రోజులపాటు నిర్వహించిన సెలెక్షన్‌ ట్రయల్స్‌ అనంతరం భారత జట్లను ఎంపిక చేశారు. వరుసగా నాలుగు ఒలింపిక్స్‌ క్రీడల్లో పాల్గొన్న ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ దీపిక కుమారి... దీపిక భర్త, భారత మాజీ నంబర్‌వన్‌ అతాను దాస్‌... వరుసగా మూడు ఆసియా క్రీడల్లో పాల్గొనడంతోపాటు రెండు స్వర్ణాలు, మూడు రజత పతకాలు నెగ్గిన అభిషేక్‌ వర్మ ట్రయల్స్‌లో విఫలమై ఆసియా క్రీడలకు ఎంపిక కాలేకపోయారు. ట్రయల్స్‌లో జ్యోతి సురేఖ 15.5 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది. 

తద్వారా వరుసగా నాలుగో ఆసియా క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని దక్కించుకుంది. ట్రయల్స్‌లో రెండో స్థానంలో నిలిచిన ప్రపంచ యూత్‌ చాంపియన్‌ చికిత, మూడో స్థానంలో నిలిచిన ప్రీతిక కూడా ఆసియా క్రీడలకు ఎంపికయ్యారు. పురుషుల కాంపౌండ్‌ విభాగంలో గణేశ్‌ 10.75 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి తొలిసారి ఆసియా క్రీడల్లో పాల్గొనే అవకాశం పొందాడు. గణేశ్‌తోపాటు సాహిల్‌ జాధవ్, కుశాల్‌ దలాల్‌ భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు. సర్వీసెస్‌ తరఫున పోటీపడ్డ ధీరజ్‌ రికర్వ్‌ విభాగంలో 15.5 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో నిలిచాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement