Rohit Sharma: ఒంటి చేత్తో మ్యాచ్‌ను లాగేయగలరు.. అందుకే: రోహిత్‌ శర్మ

Ind Vs WI T20: Rohit Sharma Says West Indies Have Got Some Real Match Winners So - Sakshi

India VS West Indies T20 Series: ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత పర్యటనలో భాగంగా టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిపోయింది వెస్టిండీస్‌. వన్డే, టీ20 సిరీస్‌లో 3-0తో వైట్‌వాష్‌కు గురైంది. ఇక సొంతగడ్డపై కూడా వన్డే సిరీస్‌లో ఇదే తరహా పరాభవాన్ని ఎదుర్కొంది విండీస్‌. ధావన్‌ సేన చేతిలో 3-0 తేడాతో క్లీన్‌స్వీప్‌ అయ్యింది. 

ఈ క్రమంలో శుక్రవారం(29) నుంచి ఆరంభం కానున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఘనంగా ఆరంభించి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. ముఖ్యంగా వన్డే సిరీస్‌లోని మొదటి రెండు మ్యాచ్‌లలో(3 పరుగులు, 2 వికెట్ల తేడాతో) ఆఖరి వరకు పోరాడి ఓడిన తాము.. తప్పులు సరిదిద్దుకుని ముందుకు సాగుతామని విండీస్‌ కెప్టెన్‌ నికోలస్‌ పూరన్‌ ఇప్పటికే స్పష్టం చేశాడు.

గతంలో గెలిచాం కదా అని..
ఈ నేపథ్యంలో మొదటి టీ20 ఆరంభానికి ముందు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘గత మ్యాచ్‌లలోని ఫలితాలతో సంబంధం లేదు. ప్రస్తుతం ముందున్న లక్ష్యం ఏమిటన్న దానిపైనే మా దృష్టి ఉంటుంది. గతంలో ఓ జట్టు మీద మనం గెలిచామంటే అది ఇప్పుడు ఉపయోగపడుతుందనుకోవడం పొరపాటే. పరిస్థితులకు తగ్గట్లుగా ఆడితేనే మెరుగైన ఫలితం పొందుతాం’’ అని పేర్కొన్నాడు.

మ్యాచ్‌ విన్నర్లు ఉన్నారు!
అదే విధంగా టీ20 ఫార్మాట్‌ అంటేనే సంచనాలకు మారుపేరని.. విండీస్‌ జట్టులో మ్యాచ్‌ విన్నర్లకు కొదువలేదని రోహిత్‌ శర్మ చెప్పుకొచ్చాడు. ‘‘పొట్టి ఫార్మాట్‌ ఎంత సరదాగా ఉంటుందో అంతే ఉత్కంఠగా ఉంటుంది. మెరుగైన ఇన్నింగ్స్‌తో ఒక్క ఆటగాడు సైతం మ్యాచ్‌ స్వరూపాన్నే పూర్తిగా మార్చివేసే అవకాశం ఉంటుంది. 

వెస్టిండీస్‌తో మ్యాచ్‌ అంటే పూర్తి స్థాయిలో సన్నద్దం కావాలి. ఎందుకంటే.. ఆ జట్టులో ఎంతో మంది మ్యాచ్‌ విన్నర్లు ఉన్నారు. ఒంటిచేత్తో మ్యాచ్‌ను మా నుంచి లాగేయగలరు. కాబట్టి వాళ్లను మేము ఏమాత్రం తేలికగా తీసుకోలేము. రోజురోజుకు మా ఆటను మెరుగుపరచుకుంటూ సన్నద్ధంగా ఉంటాము’’ అని రోహిత్‌ శర్మ పేర్కొన్నాడు. 

కాగా సొంతగడ్డపై ఈ ఏడాది ఫిబ్రవరిలో రోహిత్‌ శర్మ నాయకత్వంలోని టీమిండియా వన్డే సిరీస్‌లో విండీస్‌ను వరుసగా 6 వికెట్లు, 44 పరుగులు,96 పరుగుల తేడాతో మట్టికరిపించింది. టీ20 సిరీస్‌లో 6 వికెట్లు, 8 పరుగులు, 17 పరుగుల తేడాతో ఓడించింది. ఇక ఇటీవలి ఇంగ్లండ్‌ పర్యటనలోనూ టీమిండియా వన్డే, టీ20 సిరీస్‌లను 2-0తేడాతో గెలిచి ఫుల్‌ జోష్‌లో ఉంది. అంతేకాదు విండీస్‌తో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. దీంతో ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది.
చదవండి: Ind Vs WI T20I- Rohit Sharma: ధావన్‌పై ఓజా వ్యాఖ్యలు! తనదైన శైలిలో స్పందించిన రోహిత్‌ శర్మ

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top