Shikhar Dhawan: ఆ ముగ్గురు అద్భుతం చేశారు.. అలాంటి పొరపాట్లు సహజం.. ఆవేశ్‌ సైతం!

Ind Vs WI 2nd ODI: Shikhar Dhawan Thanks To IPL Lauds Sanju Axar Iyer - Sakshi

India Tour Of West Indies 2022- 2nd ODI: వెస్టిండీస్‌ పర్యటనలో భాగంగా రెండో వన్డేలోనూ శిఖర్‌ ధావన్‌ సేన విజయం సాధించింది. ట్రినిడాడ్‌ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ విజయంపై స్పందించిన కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌.. శ్రేయస్‌ అయ్యర్‌, సంజూ శాంసన్‌, అక్షర్‌ పటేల్‌లపై ప్రశంసలు కురిపించాడు. 

ఈ ముగ్గురు అద్భుతంగా ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారని కొనియాడాడు. కాగా ఆదివారం నాటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆతిథ్య వెస్టిండీస్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్‌ షాయీ హోప్‌ సెంచరీ చేసి.. తమ జట్టు భారీ స్కోరు నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించాడు.

కెప్టెన్‌ పూరన్‌ సైతం 74 పరుగులతో రాణించడంతో విండీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాకు శుభారంభం లభించలేదు.

ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ 13 పరుగులకే నిష్క్రమించగా.. గిల్‌ 43 పరుగులతో రాణించాడు. ఇక శ్రేయస్‌ అయ్యర్‌ 63, సంజూ శాంసన్‌ 54, దీపక్‌ హుడా 33 పరుగులు చేశారు. ఈ క్రమంలో అక్షర్‌ పటేల్‌ 64 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి.. 2 బంతులు మిగిలుండగానే జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో రెండు వికెట్ల తేడాతో టీమిండియా గెలుపొందింది.

ఈ నేపథ్యంలో ధావన్‌ మాట్లాడుతూ.. ‘‘నిజంగా ఇది అద్భుత విజయం.. కుర్రాళ్లు ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఆఖరి వరకు పోరాడిన తీరు అమోఘం. అయ్యర్‌, సంజూ, అక్షర్‌.. అందరూ అత్యద్భుతంగా రాణించారు. అరంగ్రేట మ్యాచ్‌ అయినప్పటికీ ఆవేశ్‌ కూడా జట్టుకు అవసరమైన సమయంలో 10 పరుగులు చేసి ఆదుకున్నాడు. నిజానికి ఐపీఎల్‌కు కృతజ్ఞతలు చెప్పుకోవాలి.

అలాంటి మోగా టోర్నీలో ఆడినందు వల్ల భయం, బెరుకు లేకుండా ఇక్కడ కూడా ఆడగలుగుతున్నారు’’ అని పేర్కొన్నాడు. ఇక విండీస్‌ ఆటగాళ్లలో హోప్‌, పూరన్‌ అద్బుతంగా ఆడారన్న ధావన్‌.. తమ జట్టులో గిల్‌, అయ్యర్‌- శాంసన్‌ మంచి భాగస్వామ్యం నమోదు చేశారని తెలిపాడు.

ఇక సంజూ శాంసన్‌ రనౌట్‌ గురించి మాట్లాడుతూ.. ఒక్కోసారి ఇలాంటివి జరుగుతాయని, తప్పులు సరిదిద్దుకుంటామని చెప్పుకొచ్చారు. తన లాగే వందో వన్డే మ్యాచ్‌లో సెంచరీ చేసిన వెస్టిండీస్‌ బ్యాటర్‌ హోప్‌నకు ధావన్‌ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశాడు.  
చదవండి: WI vs IND: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌.. టీమిండియాకు గుడ్‌ న్యూస్‌..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top