Ind Vs Sl: దేశం పరువు, ప్రతిష్ట గురించి కూడా ఆలోచించాలి కదా!

న్యూఢిల్లీ: టీమిండియా శ్రీలంక పర్యటనతో భారత్‌కు కలిగే ప్రయోజనమేమీ లేదని మాజీ క్రికెటర్ యజువీంద్ర సింగ్ అన్నాడు. ఆర్థిక కష్టాల్లో శ్రీలంక బోర్డును ఆదుకునేందుకే భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ద్వితీయ శ్రేణి జట్టును అక్కడికి పంపిందని అభిప్రాయపడ్డాడు. శ్రీలంకతో జరిగిన వన్డే, టీ20 సిరీస్ వల్ల టీమిండియా సమయం వృథా అయిపోయిందని యజువీంద్ర సింగ్ పేర్కొన్నాడు. కాగా కోహ్లి సారథ్యంలోని భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉండగా... శిఖర్ ధావన్ నేతృత్వంలోని టీమిండియా శ్రీలంక టూర్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే.
లంకతో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ గెలుచుకోగా... కరోనా కలకలం కారణంగా పూర్తిస్థాయి ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో టీ20 సిరీస్‌ను ఆతిథ్య జట్టుకు సమర్పించుకుంది. తద్వారా సుమారు 13 ఏళ్ల శ్రీలంక భారత్‌పై సిరీస్ విజయం సాధించినట్లయింది. ఈ నేపథ్యంలో భారత్ తరఫున టెస్టులాడిన మాజీ క్రికెటర్ యజువీంద్ర సింగ్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మూడు వన్డేలు, మూడు టీ20ల నిమిత్తం టీమిండియా శ్రీలంక టూర్‌కు వెళ్లడం వేస్ట్. పొరుగు దేశ క్రికెట్ బోర్డు ఆర్థిక నష్టాల్లో ఉందని బీసీసీఐ కరుణా హృదయంతో సిరీస్‌కు అంగీకరించింది. పక్కవారికి సాయపడటం తప్పేమీ కాదు.. కానీ దేశ పరువు, ప్రతిష్ట గురించి ఒకసారి ఆలోచించాలి కదా. టెస్టు క్రికెట్ ఆడే జట్లలో శ్రీలంక ఇప్పటికే అట్టడుగు స్థానంలో ఉంది.
అలాంటి వారిని ఓడించేందుకు పూర్తిస్థాయి టీమిండియా అక్కర్లేకపోవచ్చు. కానీ వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని జట్టును లంకకు పంపించే విషయం గురించి ఆలోచించి ఉండాల్సింది. అయినా ఐపీఎల్‌లో ఆడినంత తేలికగా.. అంతర్జాతీయ మ్యాచ్‌లలో రాణించడం సులభం కాదు’’ అని అభిప్రాయపడ్డాడు. ఇక ఈ టూర్‌లో భాగంగా కృనాల్ పాండ్యాకు కరోనా సోకగా.. మొత్తం తొమ్మిది మంది భారత ప్రధాన ఆటగాళ్లు ఐసోలేషన్‌కు వెళ్లగా.. చివరి టీ20లో చెత్త ప్రదర్శన నమోదు చేసి సిరీస్‌ను చేజార్చుకుంది. కాగా కృనాల్‌తో పాటు భారత స్పిన్నర్ యజ్వేంద్ర చహల్, కె. గౌతమ్‌లు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు