Virat Kohli- KL Rahul: కోహ్లి కెప్టెన్సీలో 108 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన రాహుల్‌.. ఇప్పుడేమో అతడి సారథ్యంలో..

Ind Vs Sa ODI Series: KL Rahul To Lead Bumrah Vice Captain Full Details - Sakshi

Ind Vs Sa ODI Series: లోకేశ్‌ రాహుల్‌ భారత క్రికెటర్‌గా మరో మెట్టు ఎక్కాడు. టెస్టు టీమ్‌కు వైస్‌ కెప్టెన్‌గా ఎంపికవడంతో పాటు సెంచూరియన్‌ టెస్టులో అద్భుత సెంచరీతో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచిన అతను తొలిసారి భారత జట్టుకు సారథ్యం వహించనున్నాడు. రోహిత్‌ శర్మ గైర్హాజరీలో అతనికి ఈ అరుదైన అవకాశం దక్కింది. భారత 26వ వన్డే కెప్టెన్‌గా అతను దక్షిణాఫ్రికా గడ్డపై జట్టును నడిపించనున్నాడు.

విరాట్‌ కోహ్లి కెప్టెన్సీలో 108 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన రాహుల్‌... అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు కోహ్లి సభ్యుడిగా ఉన్న టీమ్‌కు కెప్టెన్‌గా ఆడనుండటం విశేషం. టి20లో చక్కటి ప్రదర్శన కారణంగా సుమారు నాలుగున్నరేళ్ల విరామం తర్వాత ఆఫ్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ మళ్లీ వన్డే జట్టులోకి రావడం మరో చెప్పుకోదగ్గ అంశం.  

ముంబై: పూర్తి స్థాయి వన్డే కెప్టెన్‌గా నియమితుడైన తర్వాత తొలి సిరీస్‌కే రోహిత్‌ శర్మ దూరమయ్యాడు. తొడ కండరాల గాయంతో బాధపడుతూ దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ నుంచి తప్పుకున్న రోహిత్‌ ఇంకా కోలుకోలేదు. దాంతో వన్డే జట్టు కెప్టెన్‌గా లోకేశ్‌ రాహుల్‌ను బీసీసీఐ నియమించింది. రాహుల్‌ భారత జట్టు కెప్టెన్‌గా ఎంపికవడం ఇదే తొలిసారి. అన్ని ఫార్మాట్‌లలో భారత జట్టు అత్యుత్తమ బౌలర్‌గా ఎదిగిన జస్‌ప్రీత్‌ బుమ్రాను ఈ సిరీస్‌ కోసం వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. 18 మంది సభ్యుల జట్టును శుక్రవారం ప్రకటించిన అనంతరం సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ చేతన్‌ శర్మ ఎంపిక వివరాలను వెల్లడించారు.

పేసర్‌ షమీకి విశ్రాంతినిచ్చామని... రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌ కూడా ఇంకా గాయాల నుంచి కోలుకోలేదని ఆయన చెప్పారు. రాహుల్‌లో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని, అందుకే కెప్టెన్సీ బాధ్యతల కోసం అతడిని ప్రోత్సహిస్తున్నట్లు చేతన్‌ శర్మ వ్యాఖ్యానించారు. ‘రాబోయే రోజుల్లో భారత జట్టు పలు ప్రధాన టోర్నీలు, ప్రపంచకప్‌ ఆడాల్సి ఉంది. ఇలాంటి స్థితిలో రోహిత్‌ శర్మ పూర్తి స్థాయిలో కోలుకుంటే మంచిది. అందుకే రోహిత్‌ను దక్షిణాఫ్రికాకు పంపరాదని నిర్ణయించాం’ అని చీఫ్‌ సెలక్టర్‌ స్పష్టం చేశారు.  

వెంకటేశ్‌ అయ్యర్‌కు చాన్స్‌... 
భారత జట్టు చివరిసారిగా శ్రీలంకతో వన్డే సిరీస్‌ ఆడింది. అయితే అదే సమయంలో కీలక ఆటగాళ్లంతా ఇంగ్లండ్‌లో ఉండటంతో ద్వితీయ శ్రేణి జట్టుతో పాల్గొంది. ఇందులో వన్డేలు ఆడిన వారిలో శిఖర్‌ ధావన్‌ ఇప్పుడు ప్రధాన జట్టులోనూ తన స్థానం నిలబెట్టుకున్నాడు. అదే సిరీస్‌లో భాగంగా ఉన్నా... వన్డే ఆడే అవకాశం రాని రుతురాజ్‌ గైక్వాడ్‌కు కూడా అవకాశం దక్కింది. న్యూజిలాండ్‌తో టి20 సిరీస్‌ ఆడిన యజువేంద్ర చహల్‌ వన్డేల్లోనూ అవకాశం అందుకున్నాడు. కివీస్‌తో 3 టి20లు ఆడిన మధ్యప్రదేశ్‌ ఆల్‌రౌండర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ను మొదటిసారి వన్డే టీమ్‌లోకి ఎంపిక చేశారు. దక్షిణాఫ్రికాతో భారత జట్టు ఈనెల 19, 21, 23వ తేదీల్లో మూడు వన్డేలు ఆడుతుంది.  

సుందర్‌ మళ్లీ ... 
గాయం కారణంగా టి20 ప్రపంచకప్‌ ఆడలేకపోయిన ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ కోలుకోవడంతో మళ్లీ టీమ్‌లోకి వచ్చాడు. కెరీర్‌లో ఏకైక వన్డేను నాలుగేళ్ల క్రితం ఆడిన సుందర్‌కు ఈ ఫార్మాట్‌లో మరోసారి అవకాశం దక్కింది. ఇక సీనియర్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ వన్డే జట్టులోకి పునరాగమనం చేశాడు. నాలుగేళ్ల తర్వాత టి20 టీమ్‌లో చోటు దక్కించుకొని నిలకడగా రాణిస్తున్న అశ్విన్‌కు ఆ ప్రదర్శన వన్డే ఫార్మాట్‌లో కూడా నాలుగున్నరేళ్ల తర్వాత చోటు లభించేలా చేసింది.  

భారత వన్డే జట్టు: కేఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌), బుమ్రా (వైస్‌ కెప్టెన్‌), శిఖర్‌ ధావన్, రుతురాజ్‌ గైక్వాడ్, కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్, శ్రేయస్‌ అయ్యర్, వెంకటేశ్‌ అయ్యర్, పంత్, ఇషాన్‌ కిషన్, చహల్, అశ్విన్, వాషింగ్టన్‌ సుందర్, భువనేశ్వర్, దీపక్‌ చహర్, ప్రసిధ్‌ కృష్ణ, శార్దుల్‌ ఠాకూర్, సిరాజ్‌.

చదవండి: Team India Schedule 2022: బిజీ బిజీగా టీమిండియా.. 2022లో ఆడనున్న మ్యాచ్‌లు
IND Vs SA: తొలి టెస్టు విజయం.. టీమిండియాకు ఐసీసీ షాక్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top