Ind Vs Aus: ఆసీస్‌ను చిత్తు చేసి.. ‘ప్రధానమంత్రి సంగ్రహాలయ’ను సందర్శించిన టీమిండియా.. వీడియో వైరల్‌

Ind Vs Aus Delhi Test: Team India Visit PM Sangrahalaya After Beat Australia - Sakshi

India vs Australia, 2nd Test: ఆస్ట్రేలియాతో రెండో టెస్టు ముగించుకున్న టీమిండియా ‘ప్రధానమంత్రి సంగ్రహాలయ’ను సందర్శించింది. రెండున్నర రోజుల్లోనే ఢిల్లీ మ్యాచ్‌నూ ముగించిన రోహిత్‌ సేన ఆదివారం మిగిలిన సమయాన్ని ఈ మేరకు మ్యూజియం దర్శనకు కేటాయించింది. ఈ క్రమంలో అక్కడికి వెళ్లిన భారత క్రికెటర్లకు నిర్వాహకుల నుంచి ఘన స్వాగతం లభించింది.

రోహిత్‌, కోహ్లి సహా
హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి సహా ఇతర క్రికెటర్లకు గైడ్‌ మార్గదర్శనం చేస్తుండగా.. అంతా కలిసి మ్యూజియం కలియదిరిగారు. భారత ప్రధానుల ఔన్నత్యం, స్వతంత్ర భారతాభివృద్ధిలో వారి పాత్ర తదితర విశేషాలు తెలుసుకుంటూ ఉల్లాసంగా గడిపారు.

చరిత్రను తెలుసుకుంటూ..
ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో షేర్‌ చేసింది. ‘‘చరిత్ర.. స్వాతంత్ర్యం తర్వాత  దేశాన్ని అభివృద్ధి చేయడంలో భారత ప్రధానుల కృషిని తెలుసుకుంటూ టీమిండియా.. ఇలా పీఎం సంగ్రహాలయలో సమయం గడిపింది. స్వతంత్ర భారత ప్రయాణాన్ని తెలుసుకుంది’’ అని క్యాప్షన్‌ జత చేసింది. ఈ వీడియో, ఫొటోలు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

కాగా ప్రతిష్టాత్మక బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఢిల్లీ టెస్టులో రోహిత్‌ సేన ఆరు వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. నాగ్‌పూర్‌ టెస్టు మాదిరే ఈ మ్యాచ్‌ను కూడా రెండున్నర రోజుల్లోనే ముగించింది. ఈ గెలుపుతో 2-0తో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆధిక్యాన్ని సంపాదించింది.

ప్రత్యేకత ఏమిటి?
ప్రధానమంత్రి సంగ్రహాలయ న్యూఢిల్లీలో ఉంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిలో ప్రధాన మంత్రుల పాత్ర ఏమిటన్న విశేషాలతో ఈ మ్యూజియం రూపుదిద్దుకుంది. 

నవ భారత సామాజిక నిర్మితి, రాజకీయ, ఆర్థికాభివృద్ధిలో ప్రధానుల కృషి గురించిన వివరాలు ఇందులో పొందుపరిచారు. 2022 ఏప్రిల్‌ 14న ప్రధానమంత్రి సంగ్రహాలయ(గతంలో నెహ్రూ మోమొరియల్‌ మ్యూజియం)ను జాతికి అంకితం చేశారు. ప్రజాస్వామ్య నిలయంగా దీనిని అభివర్ణించారు. ఈ మ్యూజియం చైర్మన్‌గా న్రిపేంద్ర మిశ్రా ఉన్నారు.

చదవండి: Pat Cummins: ఉన్నపళంగా స్వదేశానికి ఆసీస్‌ కెప్టెన్‌..
పిచ్‌పై నీలాపనిందలు.. ఆడడం చేతగాకనే

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top