కెప్టెన్సీని డ్రెస్సింగ్‌ రూమ్‌లోనే వదిలేశాను.. రింకూ కోసమే అనిపించింది: సూర్యకుమార్‌ | IND VS AUS 1st T20, Vizag: Team India Captain Surya Kumar Yadav Comments After Win Against Australia | Sakshi
Sakshi News home page

IND VS AUS 1st T20: కెప్టెన్సీని డ్రెస్సింగ్‌ రూమ్‌లోనే వదిలేశాను.. రింకూ కోసమే అనిపించింది: సూర్యకుమార్‌

Nov 24 2023 9:46 AM | Updated on Nov 24 2023 10:04 AM

IND VS AUS 1st T20, Vizag: Team India Captain Surya Kumar Yadav Comments After Win Against Australia - Sakshi

ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా విశాఖ వేదికగా ఆస్ట్రేలియాతో నిన్న (నవంబర్‌ 23) జరిగిన తొలి టీ20లో టీమిండియా 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌.. జోష్‌ ఇంగ్లిస్‌ (50 బంతుల్లో 110; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) శతక్కొట్టడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్‌గా వచ్చిన స్టీవ్‌ స్మిత్‌ (52) అర్ధసెంచరీతో రాణించాడు.  ఇంగ్లిస్‌ విధ్వంసం ధాటికి ముకేశ్‌ కుమార్‌ (4-0-29-0), అక్షర్‌ పటేల్‌ (4-0-32-0) మినహా భారత బౌలర్లంతా కుదేలయ్యారు. ప్రసిద్ద్‌, రవి బిష్ణోయ్‌కు తలో వికెట్‌ దక్కింది. 

అనంతరం 209 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌.. మరో బంతి మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (42 బంతుల్లో 80; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌ ఆడి టీమిండియా గెలుపుకు బాటలు వేశాడు. ఇషాన్‌ కిషన్‌ (39 బంతుల్లో 58; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధసెంచరీతో రాణించాడు. స్కై ఔటయ్యాక ఆఖర్లో టీమిండియా 3 బంతుల్లో 3 వికెట్లు కోల్పోయి ఓటమిపాలయ్యేలా కనినపించింది.

అయితే రింకూ సింగ్‌ చివరి బంతికి సిక్సర్‌ బాది టీమిండియాను గెలిపించాడు. భారత్‌ గెలుపుకు చివరి బంతికి సింగిల్‌ అవసరం కాగా సీన్‌ అబాట్‌ నో బాల్‌ వేసి భారత గెలుపును లాంఛనం చేశాడు. దీంతో రింకూ సిక్సర్‌తో సంబంధం లేకుండానే టీమిండియా విజయం సాధించింది. రింకూ సిక్సర్‌ గణాంకాల్లో కూడా కలవలేదు. మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌ ఆడిన సూర్యకుమార్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.

మ్యాచ్‌ అనంతరం స్కై మాట్లాడుతూ.. ఈ రోజు మా ఆటతీరు అద్భుతంగా ఉంది. ఓ దశలో ఒత్తిడికి గురయ్యాము. కానీ మా ఆటగాళ్లు దాన్ని అధిగమించి సత్తా చాటారు. టీమిండియా కెప్టెన్‌గా ఇది నాకు గర్వించదగ్గ క్షణం. మ్యాచ్‌ సమయంలో మంచు కురుస్తుందని భావించాము. కానీ అలా జరగలేదు. మైదానం చిన్నది కావడంతో ఛేదనలో బ్యాటింగ్ సులభం అవుతుందని తెలుసు. వారు 230-235 సాధించవచ్చని భావించాం. కానీ ఆఖర్లో మా బౌలర్లు వారిని అద్భుతంగా కట్టడి చేశారు.

బ్యాటింగ్‌ను ఎంజాయ్‌ చేయమని ఇషాన్‌కు చెప్పాను. అందుకే అతను ఫ్రీగా షాట్లు ఆడగలిగాడు. కెప్టెన్సీ లగేజీని డ్రెస్సింగ్ రూమ్‌లో వదిలేసి బరిలోకి దిగాను. అందుకే బ్యాటింగ్‌ను ఆస్వాదించగలిగాను. ఆఖరి బంతికి రింకూ సిక్సర్‌ కొట్టడంపై స్పందిస్తూ.. అతడి కొరకే ఇలాంటి పరిస్థితులు వస్తాయన్నట్లుగా అనిపించింది. అతను ప్రశాంతంగా ఉండటమే కాకుండా నన్ను కూడా శాంతింపజేశాడు. ఇక్కడి (విశాఖ) వాతావరణం అద్భుతంగా ఉంది. ప్రేక్షకులకు ధన్యవాదాలు అని అన్నాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement