
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత అండర్–19 జట్టు దుమ్మురేపుతోంది. వన్డే సిరీస్ గెలుచుకున్న యువ భారత జట్టు... యూత్ టెస్టులో శుభారంభం చేసింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం బెకెన్‌హామ్ వేదికగా ప్రారంభమైన తొలి టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత అండర్–19 జట్టు 88 ఓవర్లలో 7 వికెట్లకు 450 పరుగులు చేసింది.
కెప్టెన్ ఆయుశ్ మాత్రే (115 బంతుల్లో 102; 14 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీతో కదం తొక్కగా... అభిజ్ఞ కుందు (95 బంతుల్లో 90; 10 ఫోర్లు, 1 సిక్స్), రాహుల్ కుమార్ (81 బంతుల్లో 85; 14 ఫోర్లు, 1 సిక్స్), విహాన్ మల్హోత్రా (99 బంతుల్లో 67; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు.
వన్డే సిరీస్‌లో రికార్డు సెంచరీతో చెలరేగిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (14) ఎక్కువసేపు నిలవలేకపోగా... అందులో పెద్దగా పరుగులు చేయలేకపోయిన ఆయుశ్ మాత్రే ‘శత’క్కొట్టాడు. అతడు రెండో వికెట్‌కు విహాన్‌తో కలిసి 173 పరుగులు జోడించాడు.
టి20 తరహాలో ధనాధన్ ఆటతీరుతో రెచ్చిపోయిన అభిజ్ఞ, రాహుల్ నాలుగో వికెట్‌కు 27.4 ఓవర్లలోనే 179 పరుగులు జోడించడంతో యువభారత్ భారీ స్కోరు చేయగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లలో అలెక్స్ గ్రీన్, జాక్ హోమ్, ఆర్చీ వాన్ తలా 2 వికెట్లు పడగొట్టారు. బ్యాటర్లంతా దూకుడు కనబర్చడంతో తొలి రోజు యంగ్‌ఇండియా 5కు పైగా రన్‌రేట్‌తో పరుగులు రాబట్టింది. అంబ్రిష్ (31 బ్యాటింగ్), హెనిల్ పటేల్ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.