
ఐదు మ్యాచ్ పాయింట్లు కాపాడుకొని నెగ్గిన భారత స్టార్ షట్లర్ ప్రణయ్
తొలి రౌండ్‌లో ప్రపంచ 18వ ర్యాంకర్ కోకి వతనాబెపై విజయం
చాంగ్జౌ: ఈ ఏడాది ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న భారత స్టార్ షట్లర్ హెచ్‌ఎస్ ప్రణయ్... ప్రతిష్టాత్మక చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీలో స్ఫూర్తిదాయక ప్రదర్శనతో శుభారంభం చేశాడు. ఓటమి అంచుల్లో ఉన్నప్పటికీ... సంయమనం కోల్పోకుండా ఆడిన ఈ కేరళ ప్లేయర్ ఏకంగా ఐదు మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని గట్టెక్కడం విశేషం. ప్రపంచ 18వ ర్యాంకర్ కోకి వతనాబె (జపాన్)తో మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ 35వ ర్యాంకర్ ప్రణయ్ 8–21, 21–16, 23–21తో గెలుపొంది ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు.
57 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రణయ్ తొలి గేమ్‌లో తేలిపోయాడు. కేవలం ఎనిమిది పాయింట్లు మాత్రమే సాధించాడు. ఒకసారి వరుసగా ఐదు పాయింట్లు, ఇంకోసారి వరుసగా మూడు పాయింట్లు, మరోసారి వరుసగా నాలుగు పాయింట్లు కోల్పోయిన ప్రణయ్ తొలి గేమ్‌లో ప్రత్యర్థి స్కోరు సమీపానికి కూడా రాలేకపోయాడు. రెండో గేమ్ నుంచి ప్రణయ్ పుంజుకున్నాడు. ఆరంభంలో 2–5తో వెనుకబడ్డ ప్రణయ్ ఆ తర్వాత 5–5తో, 7–7తో, 9–9తో స్కోరును సమం చేశాడు.
స్కోరు 9–9 వద్ద ఉన్నపుడు ప్రణయ్ ఒక్కసారిగా చెలరేగి వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గాడు. 13–9తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత తన జోరును కొనసాగిస్తూ 15–10తో ముందంజ వేసిన ప్రణయ్ ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ రెండో గేమ్‌ను సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో వతనాబె విజృంభించడంతో మొదట్లో ప్రణయ్‌కు ఏమి చేయాలో తోచలేదు. వరుస పాయింట్లు కోల్పోయిన భారత ప్లేయర్ చూస్తుండగానే 1–10తో వెనుకబడిపోయాడు.
గతంలో థామస్ కప్ టైటిల్ భారత్‌కు తొలిసారి దక్కడంలో కీలకపాత్ర పోషించిన ప్రణయ్ ఈ దశలో పోరాడితే పోయేదేమీ లేదన్నట్లు ఆడాడు. తొమ్మిది పాయింట్ల వ్యత్యాసాన్ని 10–14తో నాలుగు పాయింట్లకు తగ్గించాడు. స్వల్ప ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగిన వతనాబె 20–15తో విజయం అంచుల్లోకి వచ్చాడు. ఒక్క పాయింట్ గెలిస్తే కెరీర్‌లో ప్రణయ్‌పై వరుసగా రెండోసారి గెలుపు అందుకునేందుకు చేరువైన వతనాబె ఈ దశలో తడబడ్డాడు.
మ్యాచ్ కాపాడుకోవాలంటే ఐదు పాయింట్లు సాధించాల్సిన స్థితిలో ప్రణయ్ తుది ఫలితంపై దృష్టి పెట్టకుండా... ఒక్కో పాయింట్ నెగ్గేలా ఆడాడు. ప్రణయ్ వ్యూహం ఫలితాన్నిచ్చించంది. భారత ప్లేయర్ వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి 15–20 నుంచి 21–20తో ఆధిక్యంలో వచ్చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. వరుసగా ఆరు పాయింట్లు కోల్పోయాక వతనాబె ఒక పాయింట్ గెలిచి స్కోరును 21–21తో సమం చేశాడు. ఈ దశలో 33 ఏళ్ల ప్రణయ్ చెలరేగి వరుసగా రెండు పాయింట్లు గెలిచి గేమ్‌తోపాటు చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నాడు.
ఈ ఏడాది 11 టోర్నీలు ఆడిన ప్రణయ్ ఒక్క దాంట్లోనూ క్వార్టర్ ఫైనల్ చేరుకోలేకపోయాడు. చైనా ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లో చోటు కోసం ప్రపంచ ఆరో ర్యాంకర్, చైనీస్ తైపీ ప్లేయర్ చౌ టియెన్ చెన్‌తో ప్రణయ్ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో ప్రణయ్ 6–7తో వెనుకంజలో ఉన్నాడు. చివరిసారి వీరిద్దరు గత ఏడాది ఇండియా ఓపెన్‌లో తలపడగా... ప్రణయ్ వరుస గేముల్లో గెలిచాడు.
రెండు మ్యాచ్ పాయింట్లు వదులుకొని...
పురుషుల సింగిల్స్ మరో మ్యాచ్‌లో భారత నంబర్‌వన్, ప్రపంచ 19వ ర్యాంకర్ లక్ష్య సేన్‌కు తొలి రౌండ్‌లోనే ఓటమి ఎదురైంది. ప్రపంచ ఐదో ర్యాంకర్ లీ షి ఫెంగ్ (చైనా)తో జరిగిన మ్యాచ్‌లో లక్ష్య సేన్ 21–14, 22–24, 11–21తో ఓడిపోయాడు. 67 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో లక్ష్య సేన్ తొలి గేమ్ గెల్చుకొని, రెండో గేమ్‌లో 21–20తో, 22–21తో రెండుసార్లు విజయానికి చేరువయ్యాడు.
కానీ ఈ అవకాశాలను వదులుకున్న లక్ష్య సేన్ చివరకు 22–24తో రెండో గేమ్‌ను కోల్పోయాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో లీ షి ఫెంగ్ జోరు పెంచగా... గెలుపు అవకాశాలను వృథా చేసుకున్న లక్ష్య సేన్ డీలా పడి చివరకు 11 పాయింట్లే గెలిచి మ్యాచ్‌ను సమర్పించుకున్నాడు.
పోరాడి ఓడిన రుత్విక–రోహన్ జోడీ
మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత జోడీలకు నిరాశ ఎదురైంది. తెలంగాణ అమ్మాయి గద్దె రుత్విక శివాని–రోహన్ కపూర్ (భారత్), అశిత్ సూర్య–అమృత జోడీలు తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాయి. రుత్విక–రోహన్ ద్వయం 64 నిమిషాలు పోరాడి 27–25, 16–21, 14–21తో వోంగ్ టియెన్ సి–లిమ్ చియె సియెన్ (మలేసియా) చేతిలో... అశిత్–అమృత 12–21, 17–21తో రెహాన్–గ్లోరియా (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయారు.
మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో అనుపమ (భారత్) 23–21, 11–21, 10–21తో లిన్ సియాంగ్ టి (చైనీస్ తైపీ) చేతిలో పరాజయం పాలైంది. మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో సెల్వం కవిప్రియ–సిమ్రన్ (భారత్) 16–21, 14–21తో లౌరెన్ లామ్–అలీసన్ లీ (అమెరికా) చేతిలో... అమృత–సోనాలీ 12–21, 5–21తో సియె పె షాన్–హుంగ్ ఎన్ జు (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి చవిచూశారు.
ప్రస్తుతం నా కెరీర్‌లో ప్రతీ విజయం ముఖ్యం. గాయం నుంచి కోలుకుని మళ్లీ టోర్నీలు ఆడుతున్నందుకు ఆనందంగా ఉంది. స్వల్ప విరామాలు తీసుకుంటున్నాను. బ్యాడ్మింటన్‌లో పోటీతత్వం విపరీతంగా పెరిగిపోయింది. ప్రతీ రౌండ్‌లో గెలిచి ముందుకెళ్లడం రోజురోజుకీ క్లిష్టంగా మారిపోతోంది. పురుషుల సింగిల్స్‌లో ఆటగాళ్ల సగటు వయసు 22–23గా ఉంది. తెరపైకి ఒక్కసారిగా కొత్త వాళ్లు దూసుకొస్తున్నారు. వారు ఎలా ఆడతారో ముందస్తుగా తెలియడంలేదు. సీనియర్‌గా ఉంటూ యువ ప్రతిభావంతులతో పోరాడాలంటే కాస్త కష్టమే. – ప్రణయ్