అహ్మదాబాద్: మైదానంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా... ప్రశాంతంగా ఉండటం వల్ల సునిశిత దృష్టి అలవడుతుందని గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ పేర్కొన్నాడు. ఇటీవల టి20 వరల్డ్‌కప్ గెలిచిన భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన గిల్... ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు రెండో టైటిల్ అందించేందుకు సిద్ధమవుతున్నాడు. 2022లో ఐపీఎల్‌లో అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ తొలి సీజన్‌లోనే చాంపియన్ అవతరించింది. ఆ తర్వాత ఏడాది రన్నరప్‌గా నిలిచిన టైటాన్స్... గత సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరింది.
శుక్రవారం నుంచి ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో... ఆ ఫ్రాంచైజీ ‘శుభారంభం–2026’ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం గిల్ మాట్లాడుతూ... ‘నేను సాధారణంగా ప్రశాంతంగానే ఉంటాను. అదే నాకు జట్టుపై నమ్మకం, విశ్వాసం పెంచుతుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఒత్తిడికి లోనూ కాకుండా ఉండటం ద్వారా విశాల దృక్పథం అలవుడుతుంది. దీంతో ఆ క్షణాలను విభిన్నంగా చూడగల శక్తి వస్తుంది. అప్పుడు సమస్యల పరిష్కారం సులువు అవుతుంది’ అని వెల్లడించాడు.
ఫ్రాంచైజీ క్రికెట్ డైరెక్టర్ విక్రమ్ సోలంకి మాట్లాడుతూ... ‘గతేడాది మా జట్టు మంచి ప్రదర్శన చేసింది. ఈ సీజన్ ప్రారంభానికి ముందే ఈ కార్యక్రమం ద్వారా ఆటగాళ్లందరినీ ఒక్క చోటకు చేర్చాం. దీంతో జట్టు సభ్యుల మధ్య అనుబంధం పెరగడంతో పాటు పరస్పర నమ్మకం కలుగుతుంది. వేలంలో చిన్నచిన్న మార్పులు మాత్రమే చేశాం. జట్టు కూర్పుకు తగ్గట్లు ప్లేయర్లను ఎంపిక చేసుకున్నాం. ఆ ఫలితాలు మరి కొన్ని రోజుల్లో మీ ముందు ఉంటాయి’ అని అన్నాడు.


