ఆశల పల్లకిలో... | Gujarat Titans aim for second IPL title | Sakshi
Sakshi News home page

ఆశల పల్లకిలో...

Mar 26 2026 1:50 AM | Updated on Mar 26 2026 1:50 AM

Gujarat Titans aim for second IPL title

రెండో టైటిల్‌ లక్ష్యంగా గుజరాత్‌ టైటాన్స్‌ 

ఐపీఎల్‌లో నిలకడైన ప్రదర్శన 

గిల్‌ సారథ్యమే కీలకం  

ఐపీఎల్‌లో అడుగు పెట్టిన తొలి ఏడాదే చాంపియన్‌గా నిలిచి సంచలనం సృష్టించడంతో పాటు తర్వాతి ఏడాది కూడా రన్నరప్‌గా నిలిచి గుజరాత్‌ టైటాన్స్‌ తమ స్థాయిని ప్రదర్శించింది. అయితే ఆ తర్వాతి సీజన్‌లో అనూహ్యంగా వెనుకబడి ఎనిమిదో స్థానానికే పరిమితమైంది. కానీ గత సీజన్‌లో మెరుగైన ప్రదర్శనతో ‘ప్లే ఆఫ్స్‌’కు చేరగలిగింది. 

2025తో పోలిస్తే పెద్దగా మార్పులు లేకుండా ఈసారి కూడా జట్టు బరిలోకి దిగుతోంది. శుబ్‌మన్‌ గిల్‌ నాయకత్వానికి ఆశిష్‌ నెహ్రా కోచింగ్‌ వ్యూహాలు తోడైతే రెండో టైటిల్‌ను ఆశించవచ్చు. అయితే జోస్‌ బట్లర్, రషీద్‌ ఖాన్‌లాంటి స్టార్స్‌ ఇటీవలి తమ వైఫల్యాలను అధిగమించి ఫామ్‌లోకి రావడం జట్టుకు కీలకం.  –సాక్షి క్రీడా విభాగం  

గత సీజన్‌లో లీగ్‌ దశలో 9 మ్యాచ్‌లు గెలిచి మూడో స్థానంలో నిలిచిన టైటాన్స్‌... ‘ఎలిమినేటర్‌’లో ముంబై చేతిలో ఓడి నిష్క్రమించింది. ఐపీఎల్‌ వేలంలో ఈ ఏడాది గుజరాత్‌ ఐదుగురు ఆటగాళ్లనే ఎంచుకుంది. వీరిలో ముగ్గురు విదేశీయులు హోల్టర్, టామ్‌ బాంటన్, ల్యూక్‌ వుడ్‌ ఉన్నారు. షెర్ఫాన్‌ రూథర్‌ఫర్డ్‌ను జట్టు వదిలేసుకొని అతని స్థానంలో టామ్‌ బాంటన్‌ను ఎంచుకుంది. 

గాయం కారణంగా గత సీజన్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేకపోయిన ఫిలిప్స్‌ ఈసారి అందుబాటులో ఉండటం గుజరాత్‌ బలాన్ని పెంచింది. తుది జట్టులో ఆడే విదేశీ ఆటగాళ్లలో రషీద్, బట్లర్‌లకు చోటు ఖాయం కాబట్టి బాంటన్, ఫిలిప్స్‌లలో ఒకరికే అవకాశం దక్కవచ్చు. ఎందుకంటే బౌలింగ్‌లో రబాడ లేదా హోల్డర్‌కు అవకాశం కల్పించడం కూడా కీలకం.  

టాప్‌–3 పైనే... 
గుజరాత్‌ మరోసారి తమ టాప్‌–3 బ్యాటింగ్‌ ఆర్డర్‌పైనే ప్రధానంగా ఆధారపడుతోంది. గిల్, సాయి సుదర్శన్, బట్లర్‌ కలిసి 2025 సీజన్‌లో జట్టు మొత్తం స్కోరులో 74.54 శాతం స్కోరు సాధించారు. ఒకే టీమ్‌ నుంచి టాప్‌–3 ఒక సీజన్‌లో 500కు పైగా పరుగులు చేయడం కూడా ఇదే తొలిసారి. అయితే ఈసారి టైటాన్స్‌ ఇదే విషయంలో కొంత సవాల్‌ను కూడా ఎదుర్కొంటోంది. గిల్‌ భారత టి20 జట్టులో చోటు కోల్పోయాడు. బట్లర్‌ తన కెరీర్‌లోనే అతి ఘోరమైన ఫామ్‌లో ఉన్నాడు. 

ఇటీవలి టి20 వరల్డ్‌ కప్‌లో ఎనిమిది మ్యాచ్‌లలో అతని అత్యధిక స్కోరు 26 కాగా, ఐదుసార్లు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యాడు. సాయిసుదర్శన్‌ కూడా గాయం నుంచి కోలుకుంటున్నాడు. కాబట్టి మిడిలార్డర్‌లో బాంటన్, ఫిలిప్స్, సుందర్, షారుఖ్, తెవాటియాలపై భారీ స్కోరు భారం ఉంది. 

గత రెండు సీజన్లలో మిడిలార్డర్‌ బ్యాటర్లు కలిపి అతి తక్కువ పరుగులు చేసిన జట్టు గుజరాత్‌దే. ఈసారి మాత్రం అదనపు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హేడెన్‌ను గుజరాత్‌ తాజా సీజన్‌ కోసం బ్యాటింగ్‌ కోచ్‌గా ఎంచుకుంది కాబట్టి అతని ప్రభావం కూడా కొంత ఉండవచ్చు.  

రషీద్‌ రాణించేనా... 
ఐపీఎల్‌లో 9 సీజన్లు ఆడిన లెగ్‌స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. కానీ ఇటీవల రషీద్‌ ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. గత రెండు సీజన్లలో అతని ఫామ్‌ పేలవంగా ఉంది. 2025లోనైతే మరీ ఘోరంగా కనీసం 10 వికెట్లు కూడా తీయలేకపోయిన రషీద్‌ ఏకంగా 57.11 సగటు నమోదు చేశాడు. 

ఎకానమీ కూడా 9కి పైగా ఉంది. ఇలాంటి స్థితిలో అతను మళ్లీ లయ అందుకుంటే తప్ప గుజరాత్‌ బౌలింగ్‌ బలహీనంగా మారిపోతుంది. లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ సాయికిషోర్‌ ప్రభావం చూపించగలడు. సిరాజ్, ప్రసిధ్‌ కృష్ణ ప్రధాన పేసర్లు కాగా...మూడో పేసర్‌గా ఆల్‌రౌండర్‌ నైపుణ్యం ఉన్న హోల్డర్‌ వైపే జట్టు మొగ్గు చూపవచ్చు. వేలంలో రూ.7 కోట్లకు ఎంచుకున్న హోల్డర్‌ ఇటీవలి వరల్డ్‌ కప్‌లో మెరుగ్గా రాణించాడు. 

గత ఏడాది డోపింగ్‌ నిషేధం కారణంగా నాలుగు మ్యాచ్‌లకే పరిమితమైన రబాడ ఈసారి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాడు. విదేశీ ప్రత్యామ్నాయ పేసర్‌గా లెఫ్టార్మ్‌ బౌలర్‌ ల్యూక్‌వుడ్‌ అందుబాటులో ఉన్నాడు.  సీనియర్‌ పేసర్‌ ఇషాంత్‌కు తుది జట్టులో స్థానం లభించడం కష్టమే. ఆంధ్ర ఆటగాడు పృథ్వీరాజ్‌ గాయం కారణంగా లీగ్‌కు దూరమయ్యాడు. 2019 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరఫున 2 మ్యాచ్‌లు ఆడిన తర్వాత అతను ఇప్పటి వరకు మరో ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడలేదు.

గుజరాత్‌ టైటాన్స్‌ గణాంకాలు
ఆడిన మ్యాచ్‌లు 60 
గెలిచినవి 37 
ఓడినవి 23 
అత్యుత్తమ ప్రదర్శన
విజేత (2022), రన్నరప్‌ (2023) 

గుజరాత్‌ టైటాన్స్‌ జట్టు: శుబ్‌మన్‌ గిల్‌ (కెపె్టన్‌), జోస్‌ బట్లర్, కుమార్‌ కుశాగ్ర, అనూజ్‌ రావత్, టామ్‌ బాంటన్, గ్లెన్‌ ఫిలిప్స్, సాయిసుదర్శన్, నిశాంత్, వాషింగ్టన్‌ సుందర్, అర్షద్‌ ఖాన్, సాయికిషోర్, జయంత్‌ యాదవ్, జేసన్‌ హోల్డర్, రాహుల్‌ తెవాటియా, షారుఖ్‌ ఖాన్, రబాడ, సిరాజ్, ప్రసిధ్‌ కృష్ణ, మానవ్‌ సుతార్, గుర్నూర్‌ సింగ్, ఇషాంత్‌ శర్మ, అశోక్‌ శర్మ, ల్యూక్‌వుడ్, రషీద్‌ ఖాన్, కుల్వంత్‌ ఖెజ్రోలియా. 

Advertisement
 
Advertisement
Advertisement