
జొహన్నెస్‌బర్గ్: అంతర్జాతీయ క్రికెట్‌లో దక్షిణాఫ్రికా ఘనాపాఠి అయినా... ఐసీసీ ట్రోఫీల వెలతి మాత్రం ఆ జట్టును వేధిస్తోంది. అయితే ఈ ఏడాది సుదీర్ఘ నిరీక్షణకు తమ జట్టు తెరవేస్తుందని సఫారీ జట్టు మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ధీమా వ్యక్తం చేశాడు. వచ్చే వారం ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ పాక్‌లో మొదలుకానుంది. జూన్‌లో ఆ్రస్టేలియాతో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్‌కు ఇదివరకే దక్షిణాఫ్రికా అర్హత సాధించింది.
ఈ రెండు టోర్నీలు జరుగనున్న నేపథ్యంలో స్మిత్ తమ జట్టు ఈ ఏడాది ఐసీసీ ట్రోఫీ చేజిక్కించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ గెలుచుకున్న ‘ఎస్‌ఏటి20’ టోర్నీకి కమిషనర్‌గా వ్యవహరించిన స్మిత్ తమ జట్టు ప్రదర్శనపై గంపెడాశలు పెట్టుకున్నాడు.
‘2027లో సఫారీ ఆతిథ్యమివ్వబోయే వన్డే ప్రపంచకప్‌కు ముందే ఈ ఏడాది ఐసీసీ ట్రోఫీ లోటును భర్తీ చేసుకుంటాం. చాంపియన్స్ ట్రోఫీ, డబ్ల్యూటీసీలను గెలుచుకుంటే రెట్టించిన ఉత్సాహంతో సొంతగడ్డపై ప్రపంచకప్ ఆడేందుకు ఊతమిస్తుంది’ అని అన్నాడు. తదుపరి రెండేళ్లలో తమ దేశంలో స్టేడియాల నవీకరణ, పిచ్‌ల స్థాయి పెంచే పనులు జరుగుతాయని, దీంతో తదుపరి వన్డే మెగా ఈవెంట్ (2027)లో సొంత ప్రేక్షకుల మధ్య హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతామని చెప్పాడు.
గతేడాది జరిగిన పురుషుల, మహిళల టి20 ప్రపంచకప్‌లలో దక్షిణాఫ్రికా షరామామూలుగా ఫైనల్ మెట్టుపై చతికిలబడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. విండీస్ గడ్డపై రోహిత్ బృందం సఫారీ జట్టును ఓడించే టైటిల్ నెగ్గింది. ఈ ఏడాది అండర్–19 మహిళల టి20 ప్రపంచకప్‌లో తెలంగాణ యువతేజం గొంగడి త్రిష ఆల్‌రౌండ్ షోతో భారత జట్టు దక్షిణాఫ్రికాను చిత్తు చేసి టైటిల్‌ను నిలబెట్టుకుంది.
దీంతో దక్షిణాఫ్రికాపై ‘చోకర్స్’ ముద్ర మరింత బలంగా పడింది. అయితే ముద్రను తమ జట్టు త్వరలోనే చెరిపేస్తుందని మాజీ కెప్టెన్ స్మిత్ అన్నాడు. ఇప్పుడు క్రికెట్‌లో ఏదీ అంత సులువుగా రాదని, దేనికైనా పోరాడాల్సిందేనని చెప్పుకొచ్చాడు. టి20లకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పెరుగుతోందని, ఆలాగే సంప్రదాయ టెస్టు ప్రభ కోల్పోకూడదనుకుంటే... కనీసం 6, 7 జట్లు గట్టి ప్రత్యర్థులుగా ఎదగాల్సి ఉంటుందన్నాడు. అప్పుడే పోటీ పెరిగి టెస్టులూ ఆసక్తికరంగా సాగుతాయన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment