Photo Courtesy: IPL 2026
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్‌కు ఘనమైన రికార్డు ఉంది. ఐదుసార్లు చాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ అత్యధిక టైటిల్స్ విషయంలో సీఎస్‌కేతో కలిసి సమానంగా ఉంది. అయితే ఐపీఎల్ 2026 సీజన్‌లో మాత్రం ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటికే 9 మ్యాచ్‌లాడిన ముంబై ఏడు పరాజయాలు చవిచూసింది.
శనివారం సీఎస్‌కేతో మ్యాచ్‌లోనూ 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్ అవకాశాలను దాదాపు గల్లంతు చేసుకున్నట్లే. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ముంబై ప్లేఆఫ్ చేరడం కష్టం. ఇక కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా పూర్తిగా విఫలమవుతున్నాడు. కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అతడిపై విమర్శలు పెరిగిపోయాయి.
మ్యాచ్ ఓటములను తట్టుకోలేక సహచరులపై ఆగ్రహం వెళ్లగక్కుతున్నాడు. ఈ నేపథ్యంలోనే హార్దిక్ పాండ్యాపై ముంబై ఇండియన్స్ జట్టులో విద్వేశం పెరిగిపోయిందని, అతడికి జట్టులో కనీస మద్దతు కరువయిందంటూ మాజీ క్రికెటర్ మనోజ్ తివారి అభిప్రాయపడ్డాడు. జట్టు పేలవ ప్రదర్శనకు పాండ్యాను ఒక్కడినే నిందించడం తగదని పేర్కొన్నాడు.
క్రిక్‌బజ్‌తో మనోజ్ తివారి మాట్లాడుతూ.. ‘ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ప్రయాణం దాదాపు ముగిసినట్లే. జట్టు వైఫల్యాలకు కెప్టెన్ పాండ్యాను విమర్శిస్తున్నారు. కానీ అతడికి జట్టు నుంచి సరైన మద్దతు లేదనిపిస్తోంది. కెప్టెన్‌గా పాండ్యా చేయాల్సింది చేస్తున్నాడు. జట్టులో ఆటగాళ్లు సరిగ్గా ఆడడం లేదు. ముఖ్యంగా టీ20 క్రికెట్‌లో సూపర్‌స్టార్‌గా పేరుపొందిన సూర్యకుమార్ యాదవ్ ఘోరంగా విఫలమవుతున్నాడు. తిలక్ వర్మ ఒక్క మ్యాచ్ మినహా మళ్లీ రాణించింది లేదు.
జట్టులో నిలకడ ప్రదర్శన లేనప్పుడు పాండ్యాను తప్పుబట్టడం వల్ల ప్రయోజనం లేదు. కలిసికట్టుగా ఆడినప్పుడే జట్టుకు విజయాలు లభిస్తాయి. కానీ ముంబై ఇండియన్స్‌లో ఇప్పుడు అది మిస్సయింది. రోహిత్ గాయంతో డగౌట్‌కు పరిమితమవ్వడం, బుమ్రా, సూర్య, తిలక్ వంటి ఆటగాళ్లు ఫామ్‌లో లేకపోవడం ముంబైని దెబ్బకొట్టాయి. ఈ నేపథ్యంలో కెప్టెన్ పాండ్యాను విమర్శించడం తగదు.
అతడి ప్రవర్తనతో ఆటగాళ్లు క్రమంగా విద్వేషం పెంచుకుంటున్నారనిపిస్తుంది. అందుకే అతడికి జట్టు నుంచి మద్దతు కరువయ్యింది. ఇక 9 మ్యాచ్‌ల్లో ఏడు పరాజయాలతో ఇప్పటికే ప్లేఆఫ్ ఆశలను వదిలేసుకున్న ముంబై ఇండియన్స్‌కు అదృష్టం తోడవ్వాలి. ఎందుకంటే ప్రతీ జట్టు 14 మ్యాచ్‌లు ఆడుతుంది.
మరోవైపు టాప్-4లో ఉన్న పంజాబ్‌కు ఆరు మ్యాచ్‌లు, ఆర్సీబీ, ఎస్‌ఆర్‌హెచ్‌లకు ఐదేసీ మ్యాచ్‌లు, రాజస్తాన్‌కు నాలుగు మ్యాచ్‌లు ఉన్నాయి. ముంబై ప్లేఆఫ్ చేరాలంటే ఈ జట్లు తమ మ్యాచ్‌లన్నీ ఓడిపోవాలి. కానీ 99 శాతం ఇది జరగని పని. కాబట్టి ఐదుసార్లు చాంపియన్ అయిన ముంబై ప్లేఆఫ్ ఆశలు పక్కనబెట్టి విజయాలు సాధించి గౌరవంగా నిష్క్రమించడం మంచిది’ అని చెప్పుకొచ్చాడు.


