ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న సీఎస్‌కేకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సీజన్ ప్రారంభానికి ముందు నుంచే వేధిస్తున్న గాయాల సమస్య ఆ జట్టును మరోసారి గట్టి దెబ్బేసింది. గత మ్యాచ్‌లోనే (ముంబై ఇండియన్స్) అరంగేట్రం చేసిన ఆల్‌రౌండర్ రామకృష్ణ ఘోష్ తన తొలి మ్యాచ్‌లోనే గాయపడి సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ మ్యాచ్‌లో ఘోష్ కుడి పాదానికి ఫ్రాక్చర్ అయ్యింది.
ఘోష్ సీజన్ మొత్తానికి దూరమైన విషయాన్ని సీఎస్‌కే యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. ఘోష్ తన తొలి మ్యాచ్‌లోనే ఓ మోస్తరు ప్రదర్శన చేసి ఆకట్టుకున్నాడు. 3 ఓవర్లలో 24 పరుగులిచ్చి కీలకమైన సూర్యకుమార్ యాదవ్ వికెట్ తీశాడు. ఈ వికెట్‌కు ముందే ఘోష్ అందరి మన్ననలు అందుకున్నాడు. విల్ జాక్స్‌ను ఔట్ చేయడానికి అతను పట్టిన అద్భుతమైన డైవింగ్ క్యాచ్ మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది.
వాస్తవానికి ఘోష్ తన తొలి బంతికే గాయపడ్డాడు. ఫాలో త్రూలో అతని కాలు మెలిక పడినట్లు క్లియర్‌గా తెలిసింది. అయినా అతను మరో 17 బంతులు బౌలింగ్ చేశాడు. 20 ఓవర్ల పాటు ఫీల్డింగ్ కూడా చేశాడు. తొలి మ్యాచ్‌లోనే మంచి ఇంప్రెషన్ తెచ్చుకున్న ఘోష్ అదే మ్యాచ్‌లో గాయపడటం దురదృష్టకరం.
ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే ముంబైపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఈ గెలుపు అనంతరం కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఘోష్‌పై ప్రశంసలు కురిపించాడు. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లోనూ మంచి సామర్థ్యం చూపించాడని కొనియాడాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బౌలింగ్ చేసి ముంబైను 159 పరుగులకే కట్టడి చేసిన సీఎస్‌కే, ఆతర్వాత లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. బౌలింగ్‌లో అన్షుల్ కంబోజ్ (4-0-32-3), నూర్ అహ్మద్ (4-0-26-2), జేమీ ఓవర్టన్ (4-0-23-1) రాణించగా.. బ్యాటింగ్‌లో రుతురాజ్ (67 నాటౌట్), కార్తీక్ శర్మ (54 నాటౌట్) సత్తా చాటారు.
గాయాల శాపం
ఈ సీజన్‌లో సీఎస్‌కేకు గాయాల శాపం వెంటాడుతోంది. ఇప్పటికే ఖలీల్ అహ్మద్, అయుష్ మాత్రే, నాథన్ ఎల్లిస్ వంటి ఆటగాళ్లు గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు. ఈ జట్టు దిగ్గజం ధోని కాలి కండరాల గాయంతో సతమతమవుతూ ఇంకా బరిలోకి దిగలేదు.
ప్రస్తుతం రామకృష్ణ ఘోష్ స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. సీఎస్‌కే త్వరలోనే ప్రత్యామ్నాయ ఆటగాడిని ప్రకటించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం సీఎస్‌కే 9 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది.


