టీమిండియా (PC: BCCI)
ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియాకు మరో పరాజయం ఎదురైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన మూడో టీ20లో శ్రేయస్ అయ్యర్ సేన 125 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది.
ఫలితంగా సిరీస్‌లో 0–2తో వెనుకబడింది. నాటింగ్‌హామ్ వేదికగా టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.
ఓపెనర్ ఫిల్ సాల్ట్ (44 బంతుల్లో 70; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకంతో అదరగొట్టగా... జోస్ బట్లర్ (21 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), సామ్ కరన్ (24 బంతుల్లో 41 నాటౌట్; 4 ఫోర్లు) వేగంగా ఆడారు. టీమిండియా బౌలర్లలో హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
బ్యాట్లెత్తేశారు
అనంతరం భారీ లక్ష్యఛేదనలో టీమిండియా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. మరీ దారుణంగా 11.4 ఓవర్లలో 76 పరుగులకే ఆలౌటైంది. టాపార్డర్‌లో పదిహేనేళ్ల వైభవ్ సూర్యవంశీ (5 బంతుల్లో 13; 2 సిక్స్‌లు), అభిషేక్ శర్మ (10; 1 సిక్స్), ఇషాన్ కిషన్ (13; 1 ఫోర్, 1 సిక్స్) పూర్తిగా విఫలమయ్యారు.
ఇక సారథి శ్రేయస్ అయ్యర్ (5), అక్షర్ పటేల్ (10), తిలక్ వర్మ (3), హర్షిత్ రాణా (9), శివమ్ దూబే (2) కూడా బ్యాట్లెత్తేశారు. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి మనవాళ్లు పెవలియన్‌కు వరుస కట్టారు.
దారుణ వైఫల్యం
కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా క్రీజులో నిలిచే ప్రయత్నం చేయకుండా... షాట్‌లు ఆడేందుకు ప్రయత్నించి వికెట్‌లు సమర్పించుకున్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 4 వికెట్లు పడగొట్టగా... జోఫ్రా ఆర్చర్‌కు మూడు వికెట్లు పడగొట్టాడు.
ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లతో పాటు యాజమాన్యంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతటి చెత్త ప్రదర్శన మునుపెన్నడూ చూడలేదని.. తుదిజట్టులో తరచూ మార్పులే ఇందుకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో భారత స్పిన్ దిగ్గజం, మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే తన అభిప్రాయాలు పంచుకున్నాడు. జియోహాట్‌స్టార్ షోలో మాట్లాడుతూ.. నాలుగో టీ20లో మాత్రం టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎలాంటి మార్పులు చేయవద్దని సూచించాడు. ముఖ్యంగా మూడు మ్యాచ్‌లలో విఫలమైనప్పటికీ తిలక్ వర్మను కొనసాగించాలని కుంబ్లే అభిప్రాయపడ్డాడు.
తుదిజట్టులో మార్పులు వద్దు
‘‘తుదిజట్టులో ఎలాంటి మార్పులు అవసరం లేదని నేను భావిస్తున్నాను. అలా చేస్తేనే జట్టులో ఆత్మవిశ్వాసం పెంపొందించగలరు. ఇక తిలక్ వర్మ.. అతడు ఇప్పుడు వైస్ కెప్టెన్. అతడికి ఓ బాధ్యత అప్పగించారు. కాబట్టి అతడికి మరొక్క అవకాశం ఇవ్వాల్సిందేనని నా భావన.
బౌలర్లు మారాలి
మన బౌలర్లు కూడా తమ ఆట తీరును మార్చుకోవాల్సి ఉంది. మనోళ్లు ధారాళంగా పరుగులు ఇచ్చుకున్న చోట.. ప్రత్యర్థి జట్టు మాత్రం 76 పరుగులకే మనోళ్లను ఆలౌట్ చేసింది. ఇక్కడే తేడా స్పష్టంగా తెలుస్తోంది. మన ప్రణాళికలు, వ్యూహాలు పరిస్థితులకు తగ్గట్లుగా మార్చుకోవాలి’’ అని అనిల్ కుంబ్లే హితవు పలికాడు.
కాగా ఇంగ్లండ్‌తో తొలి టీ20లో 13 పరుగులు చేసిన తిలక్ వర్మ.. రెండో టీ20లో 24 (నాటౌట్) పరుగులతో ఫర్వాలేదనిపించాడు. అయితే, మంగళవారం నాటి మూడో మ్యాచ్‌లో మాత్రం 11 బంతులు ఎదుర్కొని మూడు పరుగులకే నిష్క్రమించాడు.
ఇదిలా ఉంటే.. తొలి టీ20లో ఆడిన సంజూ శాంసన్‌పై వేటు వేసిన యాజమాన్యం.. అతడి స్థానంలో వైభవ్ సూర్యవంశీని కొనసాగిస్తోంది. ఇక రెండో టీ20లో దారుణంగా విఫలమైన రవి బిష్ణోయిని తప్పించి.. అతడి స్థానంలో మూడో టీ20లో ప్రిన్స్ యాదవ్‌ను ఆడించారు. ఇరుజట్ల మధ్య గురువారం జరిగే నాలుగో టీ20కి బ్రిస్టల్ వేదిక.
ఇంగ్లండ్‌తో మూడో టీ20 ఆడిన భారత తుదిజట్టు
అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అక్షర్ పటేల్, తిలక్ వర్మ, హర్షిత్ రాణా, శివం దూబే, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్.
చదవండి: అందుకే వైభవ్‌ను ఆడిస్తున్నాం: కుండబద్దలు కొట్టిన గంభీర్


