
నేడు గుజరాత్‌తో సమరం
మ్యాచ్ గెలిస్తే ‘ప్లే ఆఫ్స్’కు గిల్ బృందం
రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
న్యూఢిల్లీ: ఐపీఎల్–2025ను ఢిల్లీ క్యాపిటల్స్ ఘనంగా ప్రారంభించింది. తొలి 4 మ్యాచ్‌లలో వరుస విజయాలు సాధించి జోరు ప్రదర్శించింది. అయితే తర్వాత జట్టు ఫామ్ ఒక్కసారిగా తిరోగమించింది. తర్వాత 7 మ్యాచ్‌లలో ఢిల్లీ కేవలం 2 మాత్రమే గెలవగలిగింది. హైదరాబాద్‌లో జరిగిన తమ చివరి పోరులో కూడా క్యాపిటల్స్ 133 పరుగులకే పరిమితమై ఓటమికి బాటలు వేసుకుంది. అయితే అదృష్టవశాత్తూ వర్షంతో ఆ మ్యాచ్ రద్దు కావడంతో ఊపిరి పీల్చుకుంది.
ఇప్పుడు మిగిలిన 3 మ్యాచ్‌లలో గెలిస్తే ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా ‘ప్లే ఆఫ్స్’కు చేరుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ నిలకడకు మారుపేరులా ఆడుతూ ముందంజ వేసేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండోస్థానంలో ఉన్న ఆ టీమ్ మరో మ్యాచ్ గెలిస్తే చాలు అధికారికంగా ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది. ఈ మ్యాచ్‌లోనే దానిని అందుకోవాలని గిల్ బృందం భావిస్తోంది.
ముస్తఫిజుర్ దూరం...
ఐపీఎల్ కొత్త షెడ్యూల్ కారణంగా ఢిల్లీ ప్రణాళికలు కూడా మారాయి. కీలక సమయంలో జట్టును గెలిపించే సత్తా ఉన్న ప్రధాన పేసర్ మిచెల్ స్టార్క్ ఆ్రస్టేలియాకు వెళ్లిపోయాడు. అతని స్థానంలో బంగ్లాదేశ్ బౌలర్ ముస్తఫిజుర్‌ను ఢిల్లీ ఎంచుకుంది. అయితే శనివారం షార్జాలో టి20 మ్యాచ్ ఆడిన అతను తిరిగి వచ్చి ఈ మ్యాచ్ బరిలోకి దిగే అవకాశం లేదు.
దాంతో తుది జట్టులో ముగ్గురు విదేశీయులే ఉండనున్నారు. డుప్లెసిస్, స్టబ్స్ పునరాగమనంతో జట్టు బ్యాటింగ్ బలంగా కనిపిస్తుండగా, పేసర్ చమీరా కూడా ఆడనున్నాడు. అయితే జట్టు విజయావకాశాలు భారత ఆటగాళ్లు పొరేల్, కరుణ్ నాయర్, రాహుల్, కెప్టెన్ అక్షర్ ప్రదర్శనపైనే ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. విప్‌రాజ్, అశుతోష్ మిడిలార్డ్‌లో చెలరేగాల్సి ఉండగా... కుల్దీప్ యాదవ్ ఎప్పటిలాగే తన పదును చూపిస్తే ప్రత్యర్థిని కట్టిపడేయవచ్చు.
మార్పుల్లేకుండా...
టోర్నీ వాయిదా తర్వాత ఎలాంటి ఇబ్బందీ లేకుండా దాదాపు అదే ప్రధాన ఆటగాళ్లతో జట్టును సిద్ధం చేసుకోవడంలో గుజరాత్ సఫలం కావడం విశేషం. మరో మ్యాచ్ గెలిస్తే ముందంజ వేసే టీమ్ మరో రెండు కూడా నెగ్గి టాప్ స్థానంపై గురి పెట్టింది. లీగ్ దశ వరకు బట్లర్, రూథర్‌ఫర్డ్, రబడ, కొయెట్జీ అందుబాటులో ఉంటుండటంతో టైటాన్స్ మేనేజ్‌మెంట్ ధీమాగా ఉంది. ఓపెనర్లు గిల్, సుదర్శన్ అందిస్తున్న చక్కటి ఆరంభాలు జట్టును ముందంజలో నిలిపాయి.
ఆ తర్వాత బట్లర్ మిగిలిన పని పూర్తి చేస్తున్నాడు. సీజన్‌లో 500 పరుగులు దాటిన టాప్–5లో ముగ్గురు టైటాన్స్ సుదర్శన్, గిల్, బట్లర్ ఉండటం విశేషం. షారుఖ్, తెవాటియా చివర్లో అదనపు పరుగులు జోడించగలరు. ముగ్గురు పేసర్లు ప్రసిధ్, సిరాజ్, అర్షద్ చక్కటి బౌలింగ్ ప్రదర్శన కనబరుస్తుండగా... స్పిన్నర్లు సాయికిషోర్, రషీద్ ఖాన్ తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. బలాబలాలపరంగా చూస్తే టైటాన్స్‌దే పైచేయిగా కనిపిస్తోంది.