డబుల్‌ ధమాకా 

Bronze medals Indian team open women category in Chess Olympiad - Sakshi

చెస్‌ ఒలింపియాడ్‌లో ఓపెన్, మహిళల విభాగంలో భారత జట్లకు కాంస్య పతకాలు

వ్యక్తిగత విభాగంలో గుకేశ్, నిహాల్‌కు స్వర్ణాలు

అర్జున్‌కు రజతం, ప్రజ్ఞానందకు కాంస్యం

వైశాలి, దివ్య, తానియా సచ్‌దేవ్‌కు కాంస్యాలు  

సాక్షి, చెన్నై: భారత్‌లో తొలిసారి నిర్వహించిన ప్రతిష్టాత్మక చెస్‌ ఒలింపియాడ్‌లో ఆతిథ్య భారత జట్టు అదరగొట్టింది. సోమవారం ముగిసిన ఈ మెగా ఈవెంట్‌లో ఓపెన్‌ విభాగంలో దొమ్మరాజు గుకేశ్, నిహాల్‌ సరీన్, ప్రజ్ఞానంద, ఆధిబన్, రౌనక్‌ సాధ్వానిలతో కూడిన భారత ‘బి’ జట్టు... మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వైశాలి, తానియా సచ్‌దేవ్, భక్తి కులకర్ణిలతో కూడిన భారత ‘ఎ’ జట్టు కాంస్య పతకాలు సాధించాయి.  

► నిర్ణీత 11 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో ఓపెన్‌ విభాగంలో భారత ‘బి’ జట్టు 8 విజయాలు, 2 ‘డ్రా’లు, ఒక ఓటమితో మొత్తం 18 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది. ఉజ్బెకిస్తాన్, అర్మేనియా 19 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలువగా... మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా ఉజ్బెకిస్తాన్‌ చాంపియన్‌గా అవతరించింది. అర్మేనియా రన్నరప్‌గా నిలిచింది. 
► పెంటేల హరికృష్ణ, ఇరిగేశి అర్జున్, విదిత్, నారాయణన్, కృష్ణన్‌ శశికిరణ్‌లతో కూడిన భారత ‘ఎ’ జట్టు 17 పాయింట్లతో నాలుగో స్థానంలో... సూర్యశేఖర గంగూలీ, సేతురామన్, అభిజిత్‌ గుప్తా, మురళీ కార్తికేయ, అభిమన్యులతో కూడిన భారత ‘సి’ జట్టు 14 పాయింట్లతో 31వ స్థానంలో నిలిచాయి.  
► చివరిదైన 11వ రౌండ్‌లో భారత్‌ ‘బి’ 3–1తో జర్మనీని ఓడించింది. గుకేశ్, ప్రజ్ఞానంద తమ గే మ్‌లను ‘డ్రా’ చేసుకున్నారు. నిహాల్, రౌనక్‌ తమ ప్రత్యర్థులపై గెలిచారు. అమెరికాతో మ్యాచ్‌ ను భారత్‌ ‘ఎ’ 2–2తో... కజకిస్తాన్‌తో మ్యాచ్‌ను భారత్‌ ‘సి’ 2–2తో ‘డ్రా’ చేసుకున్నాయి.  
ఓపెన్‌ విభాగంలో భారత ‘బి’ జట్టు సభ్యులు ప్రజ్ఞానంద, ఆధిబన్, రౌనక్, నిహాల్‌ సరీన్‌, గుకేశ్‌  

అమెరికా చేతిలో ఓడి... 
మహిళల విభాగంలో భారత ‘ఎ’ జట్టు చాంపియన్‌గా నిలిచే అవకాశాన్ని చేజార్చుకుంది. సోమ వారం జరిగిన చివరిదైన 11వ రౌండ్‌లో భారత ‘ఎ’ జట్టు 1–3తో అమెరికా చేతిలో ఓడిపోయింది. ఒకవేళ భారత జట్టు ఈ మ్యాచ్‌లో గెలిచి ఉంటే చాంపియన్‌ అయ్యేది. భారత్, అమెరికా, కజకిస్తాన్‌ 17 పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో నిలువగా... మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా భారత్‌కు కాంస్య పతకం ఖరారైంది. అమెరికా నాలుగో స్థానంతో, కజకిస్తాన్‌ ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాయి. 18 పాయింట్లతో ఉక్రెయిన్, జార్జియా సంయుక్తంగా అగ్రస్థానంలో నిలువగా... మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా ఉక్రెయిన్‌కు టైటిల్‌ ఖాయమైంది. జార్జియా రన్నరప్‌గా నిలిచింది. వంతిక అగర్వాల్, పద్మిని రౌత్, సౌమ్య స్వామినాథన్, మేరీఆన్‌ గోమ్స్, దివ్య దేశ్‌ముఖ్‌లతో కూడిన భారత ‘బి’ జట్టు 16 పాయింట్లతో 8వ స్థానంలో... ఇషా కరవాడే, నందిద, ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారి ణులు సాహితి వర్షిణి, ప్రత్యూష, విశ్వ వాస్నావాలాలతో కూడిన భారత ‘సి’ జట్టు 15 పాయింట్లతో 17వ ర్యాంక్‌లో నిలిచాయి.  

► క్లాసికల్‌ విభాగంలో ముఖాముఖిగా జరిగిన చెస్‌ ఒలింపియాడ్‌లో ఒకేసారి భారత జట్టు ఓపెన్, మహిళల విభాగంలో పతకాలు సాధించడం ఇదే మొదటిసారి. ఓపెన్‌ విభాగంలో భారత్‌కిది రెండో పతకం. 2014లో నార్వేలో జరిగిన చెస్‌ ఒలింపియాడ్‌లో పరిమార్జన్‌ నేగి, సేతురామన్, కృష్ణన్‌ శశికిరణ్, ఆధిబన్, ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ లలిత్‌ బాబులతో కూడిన భారత జట్టు ఓపెన్‌ విభాగంలో కాంస్య పతకం గెలిచింది. చెస్‌ ఒలింపియాడ్‌లో రెండు పతకాలు నెగ్గిన తొలి భార తీయ ప్లేయర్‌గా ఆధిబన్‌ నిలిచాడు. కరోనా కారణంగా 2020లో ఆన్‌లైన్‌ లో నిర్వహించిన ఒలింపియాడ్‌లో భారత్, రష్యా సంయుక్త విజేతలుగా నిలువగా... 2021లో ఆన్‌లైన్‌లోనే జరిగిన ఒలింపియాడ్‌లో భారత్‌ కాంస్యం సాధించింది.   

మనోళ్లకు ఏడు పతకాలు
టీమ్‌ విభాగంలో కనబరిచిన ప్రదర్శన ఆధారంగా వ్యక్తిగత విభాగం పతకాలను (కనీసం 8 గేమ్‌లు ఆడాలి) ఖరారు చేయగా... భారత ప్లేయర్లకు ఏడు పతకాలు లభించాయి. బోర్డు–1పై 11 గేమ్‌లు ఆడిన తమిళనాడు కుర్రాడు గుకేశ్‌ 9 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని... బోర్డు–2పై 10 గేమ్‌లు ఆడిన నిహాల్‌ సరీన్‌ 7.5 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నారు. బోర్డు–3పై 11 గేమ్‌లు ఆడిన తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ ఇరిగేశి అర్జున్‌ 8.5 పాయింట్లతో రజతం... బోర్డు–3పైనే 9 గేమ్‌లు ఆడిన తమిళనాడు కుర్రాడు ప్రజ్ఞానంద 6.5 పాయింట్లతో కాంస్యం గెల్చుకున్నారు. మహిళల విభాగంలో బోర్డు–3పై 11 గేమ్‌లు ఆడిన వైశాలి 7.5 పాయింట్లతో కాంస్యం, బోర్డు–4పై 11 గేమ్‌లు ఆడిన తానియా 8 పాయింట్లతో కాంస్యం... బోర్డు–5పై 9 గేమ్‌లు ఆడిన దివ్య 7 పాయింట్లతో కాంస్యం సొంతం చేసుకున్నారు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top