T20 WC 2022: ఉత్కంఠ పోరులో జింబాబ్వేపై బంగ్లాదేశ్‌ విజయం

Bangladesh survive Zimbabwe scare to register a close win - Sakshi

టీ20 ప్రపంచకప్‌-2022లో మరో ఉత్కంఠ పోరు జరిగింది. క్రికెట్‌ అభిమానులకు జింబాబ్వే- బంగ్లాదేశ్‌ మ్యాచ్‌ అసలు సిసలైన మజా అందించింది.  అఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో జింబాబ్వేపై బంగ్లాదేశ్‌ మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది. 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే నిర్ణీత 20 ఓ‍వర్లలో 8 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది.

జింబాబ్వే  బ్యాటర్‌ విలియమ్స్‌(64) పరుగులతో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. అయితే అఖరిలో విలియమ్స్‌ రనౌట్‌గా వెనుదిరగడంతో మ్యాచ్‌ ఒక్క సారిగా బంగ్లాదేశ్‌ వైపు మలుపు తిరిగింది.

అఖరి ఓవర్‌లో హై డ్రామా..
అఖరి ఓ‍వర్‌లో జింబాబ్వే విజయానికి 16 పరుగులు అవసరమవ్వగా.. షకీబ్‌ బంతిని మొసద్దెక్ హుస్సేన్‌ చేతికి ఇచ్చాడు. తొలి బంతికి లెగ్‌ బైస్‌ రూపంలో ఒక పరగు రాగా.. రెండో బంతికి ఎవెన్స్‌ ఔటయ్యాడు. దీంతో మ్యాచ్‌ సమీకరణం నాలుగు బంతుల్లో 15 పరుగులుగా మారింది. ఈ క్రమంలో మూడో బంతికి లెగ్‌ బైస్‌ రూపంలో నాలుగు పరుగులు, నాలుగో బంతికి నగరవా భారీ సిక్స్‌ బాదాడు. దీంతో ఒక్క సారిగా మ్యాచ్‌ జింబాబ్వే వైపు మలుపు తిరిగింది. 

దీంతో అఖరి రెండు బంతుల్లో జింబాబ్వే విజయానికి 5 పరుగులు అవసరమయ్యాయి. అయితే ఐదో బంతికి నగరవా స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో అఖరి బంతికి జింబాబ్వే విజయానికి 5 పరుగులు అవసరమయ్యాయి. అఖరి బంతికి ముజారబానీ స్టంపౌట్‌గా వెనుదిరగాడు. దీంతో బంగ్లాదేశ్‌ గెలుపు సంబురాల్లో మునిగి తేలిపోయింది. ఇక్కడే అసలు ట్విస్ట్‌ చోటు చేసుకుంది. 

అఖరి బంతిని వికెట్‌ కీపర్‌ స్టంప్స్‌కు ముందు పట్టి ఔట్‌ చేయడంతో థర్డ్‌ అంపైర్‌ నో బాల్‌గా ప్రకటించారు. ఈ క్రమంలో జింబాబ్వేకు  ఫ్రీ హిట్‌ లభించింది. అయితే ఫ్రీ హిట్‌ బంతికి ఒక్క పరుగు కూడా జింబాబ్వే సాధించలేకపోయింది. బంగ్లాదేశ్‌ బౌలర్లలో టాస్కిన్‌ అహ్మద్‌ మూడు వికెట్లతో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. అతడితో పాటు మొసద్దెక్ హుస్సేన్‌, ముస్తిఫిజర్‌ రెహ్మన్‌ తలా రెండు వికెట్లు సాధించారు.

అర్ద సెంచరీతో చెలరేగిన నజ్ముల్ హుస్సేన్
ఇక తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది.  బంగ్లా బ్యాటర్లలో నజ్ముల్ హుస్సేన్ శాంటో(71) పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. అతడితో పాటు అఫీఫ్ హుస్సేన్(29), షకీబ్‌ ఆల్‌ హసన్‌(23) పరుగులతో రాణించారు. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగరవ, ముజారబానీ తలా రెండు వికెట్లు సాధించగా.. రజా, విలియమ్స్‌ చెరో వికెట్‌ సాధించారు.
చదవండి: T20 WC 2022: 'భారత్‌ అద్భుతంగా ఆడుతోంది.. దక్షిణాఫ్రికాపై విజయం మనదే'

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top