BWF 2022: ప్రణయ్ జోరుకు తెర

ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రెండుసార్లు విజేతగా నిలిచిన జపాన్ స్టార్, టైటిల్ ఫేవరెట్ కెంటో మొమోటాపై సంచలన విజయంతో పతకం ఆశలు రేపిన హెచ్.ఎస్.ప్రణయ్ ‘షో’కు క్వార్టర్ ఫైనల్లో తెరపడింది. పురుషుల సింగిల్స్‌లో చైనా ఆటగాడు జావో జన్ పెంగ్ 19–21, 21–6, 21–18తో ప్రణయ్ ఆశల్ని క్వార్టర్స్‌లోనే తుంచేశాడు. తొలి గేమ్ ఆరంభంలో బాగా ఆడిన ప్రణయ్ ఒక దశలో 19–13తో ఆధిక్యంలో ఉన్నాడు. కానీ అదే పనిగా చేసిన తప్పిదాలతో అనూహ్యంగా ప్రత్యర్థి 19–19తో పుంజుకున్నాడు.
కానీ ప్రణయ్ వరుసగా రెండు పాయింట్లు చేసి గేమ్ కైవసం చేసుకున్నాడు. రెండో గేమ్‌లో భారత ఆటగాడు పూర్తిగా నిరాశపరిచాడు. దీంతో చైనీస్ షట్లర్ 11–1తో దూసుకెళ్లాడు. అదే జోరుతో గేమ్ గెలిచాడు. మూడో గేమ్‌లో ప్రత్యర్థికి దీటుగా రాణించినప్పటికీ కీలక తరుణంలో పాయింట్లు చేసిన చైనా ఆటగాడు గేమ్‌తో పాటు మ్యాచ్ గెలిచి సెమీస్ చేరాడు. గతేడాది స్పెయిన్‌లో జరిగిన ఈవెంట్‌లోనూ ప్రణయ్ ఆట క్వార్టర్స్‌లోనే ముగిసింది.