ఐపీఎల్‌లో అమలు చేసే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తనకు నచ్చదని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ పేర్కొన్నాడు. ఒక ఆల్‌రౌండర్‌గా తాను ఎప్పటికీ ఇంపాక్ట్ రూల్‌ను వ్యతిరేకిస్తూనే ఉంటానని తెలిపాడు. ఈ నిబంధన ద్వారా ఆల్‌రౌండర్లకు అన్యాయం జరుగుతుందన్న వాదనల్లో నిజముందని అక్షర్ వ్యాఖ్యానించాడు.
అక్షర్ మాట్లాడుతూ.. ‘ఆ నిబంధన నాకు నచ్చదు. స్వతహాగా నేను ఆల్‌రౌండర్‌ను. గతంలో మేం ఈ రోల్ (బ్యాటింగ్, బౌలింగ్ చేసేవారు) కోసం ఆల్‌రౌండర్‌ను ఎంపిక చేసుకునేవాళ్లం. కానీ ఇప్పుడు టీమ్ మేనేజ్‌మెంట్ మాత్రం అవసరాన్ని బట్టి బ్యాటర్, బౌలర్‌ను వాడుకుంటున్నది. అదే సమయంలో మనకు ఆల్‌రౌండర్ అవసరమా? అన్న చర్చ తలెత్తుతున్నది.
నేను దీనికి మొదటి నుంచి వ్యతిరేకినే. కానీ రూల్స్ అంటే రూల్సే కదా. మనం వాటిని పాటించాలి తప్పదు’ అని అన్నాడు. గతంలోనూ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై ముంబై ఇండియన్స్ క్రికెటర్లు రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యా సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 2018 నుంచి చూసుకుంటే అక్షర్ పటేల్ గత సీజన్‌లో కేవలం 34 ఓవర్లు మాత్రమే బౌలింగ్ వేశాడు.
ఇదే విషయమై అక్షర్ స్పందిస్తూ.. ‘18వ సీజన్‌లో నేను ఎక్కువగా బౌలింగ్ చేయకపోవడానికి చేతి వేలి గాయమే. ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో బంతిని తిప్పేందుకు ఉపయోగపడే నా వేలికి గాయమైంది. బౌలింగ్ చేస్తున్నప్పుడు ఆ గాయం మరింత పెద్దదైంది. దాంతో ఐపీఎల్‌లో జట్టుకు అవసరమైనప్పుడే బౌలింగ్ చేసి నా వేలిని కాపాడుకున్నా. ఏడు మ్యాచ్‌ల తర్వాత నా వేలి గాయం పూర్తిగా తగ్గిపోయింది.’ అని చెప్పుకొచ్చాడు.
అక్షర్‌పటేల్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ గత సీజన్‌లో లీగ్ దశకే పరిమితమైంది. ఇక ఐపీఎల్ 2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తన తొలి మ్యాచ్‌ను ఏప్రిల్ 1న లక్నో సూపర్‌జెయింట్స్‌తో ఆడనుంది.


