Novak Djokovic: పోతూ పోతూ నష్టం మిగిల్చాడు.. కట్టేది ఎవరు?

Australian Taxpayers Bear Novak Djokovic Legal Fees Worth Rs 2 Crore Above - Sakshi

సెర్బియా టెన్నిస్‌ స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ ఆడకుండా ఆస్ట్రేలియా ప్రభుత్వం బహిష్కరించిన సంగతి తెలిసిందే. వ్యాక్సిన్‌ వేయించుకోకుండా గ్రాండ్‌స్లామ్‌ ఆడతానంటే కుదరదని ఆసీస్‌ ప్రభుత్వం తేల్చిచెప్పింది. దీనిపై కోర్టుకెళ్లిన జొకోవిచ్‌ తొలిసారి ఊరట కలిగినప్పటికి.. రెండోసారి భంగపాటు ఎదురైంది.  వీసా రద్దు కారణంగా... జొకో మూడేళ్ల పాటు ఆస్ట్రేలియాలో అడుగుపెట్టకుండా ఆ దేశ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది.

అయితే పోతూపోతూ జొకోవిచ్‌ విచారణ బిల్లు రూపంలో ఆ దేశ పన్ను బేరర్లకు 265,000 ఆస్ట్రేలియన్‌ డాలర్ల నష్టాన్ని మిగిల్చి వెళ్లాడు. ఇండియన్‌ కరెన్సీలో దాదాపు రూ. 2 కోట్ల 68 లక్షలు విలువ ఉంటుంది. ఈ నష్టాన్ని ఎవరు భరిస్తారంటూ పలువురు పేర్కొనగా.. దీనిపై టెన్నిస్‌ ఆస్ట్రేలియా స్పందించింది. జొకోవిచ్‌ విచారణ బిల్లును తామే భరిస్తామని ఒక ప్రకటనలో తెలిపింది.

ఇక జొకోవిచ్‌ రగడ అంత తొందరగా ఎవరు మరిచిపోలేరు. కరోనా వ్యాక్సిన్‌ వేయించుకోకుండానే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ ఆడేందుకు జొకోవిచ్‌ ఆసీస్‌ గడ్డపై అడుగుపెట్టాడు. అయితే ఆ దేశ ప్రభుత్వం మాత్రం వ్యాక్సిన్‌ వేయించుకుంటేనే ఆడేందుకు అనుమతిస్తామని తేల్చిచెప్పింది. ఇక్కడ మొదలైన సమస్య 11 రోజుల పాటు పెద్ద తలనొప్పిగా మారిపోయింది. అయితే ఆస్ట్రేలియా ప్రభుత్వంపై కోర్టుకెక్కి విజయం సాధించాడు. అయితే ఆ దేశ ప్రభుత్వం మాత్రం తమకున్న అధికారాలతో మరోసారి వీసాను రద్దు చేసింది. దీంతో జొకో రెండోసారి కోర్టును ఆశ్రయించాడు. కానీ.. ఈసారి మాత్రం అతడికి నిరాశే ఎదురైంది. న్యాయస్థానం ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా వీసాను రద్దు చేశామన్న ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top