పింక్‌బాల్‌ టెస్ట్‌‌ : 8 వికెట్లతో ఆసీస్‌ ఘన విజయం

Australia Won Match By 8 Wickets Against India In Pink Ball Test - Sakshi

అడిలైడ్‌ : టీమిండియాతో జరిగిన పింక్‌బాల్‌ టెస్టులో ఆసీస్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా విధించిన 90 పరుగులు టార్గెట్‌ను ఆతిథ్య జట్టు రెండు వికెట్లు కోల్పోయి చేధించింది. జో బర్స్న్‌ అర్థసెంచరీతో మెరవగా.. వేడ్‌ 33, లబుషేన్‌ 6 పరుగులు చేశారు. కాగా  అంతకముందు ఓవర్‌నైట్‌  స్కోరు 9/1తో బరిలోకి దిగిన టీమిండియా ఇన్నింగ్స్‌ మూడో రోజు పేకమేడలా కుప్పకూలింది. భారత జట్టు 21.2 ఓవర్లు మాత్రమే ఆడి 36 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ ముగించింది. కేవలం 27 పరుగుల వ్యవధిలో మిగిలిన 9 వికెట్లు చేజార్చుకున్న టీమిండియా టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యల్ప స్కోరును నమోదు చేసింది (చదవండి : టీమిండియా ఘోర వైఫల్యం.. నెటిజన్ల ట్రోల్స్‌)

ఆసీస్‌ పేసర్లు హాజిల్‌వుడ్‌, పాట్‌ కమిన్స్‌ దాటికి ఏడుగురు భారత బ్యాట్స్‌మెన్లు సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కాగా..ముగ్గురు ఖాతా తెరవకపోవడం విశేషం. కాగా తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 244 పరుగులకు ఆలౌట్‌ కాగా.. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. ఈ విజయంతో పింక్‌బాల్‌టెస్టుల్లో ఆసీస్‌ వరుసగా ఎనిమిదో విజయం సొంతం చేసుకొని తన రికార్డును మరింత పటిష్టపరుచుకుంది. కాగా ఇరుజట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్‌ మెల్‌బోర్న్‌ వేదికగా డిసెంబర్‌ 25 శుక్రవారం మొదలుకానుంది. విరాట్‌ కోహ్లి పెటర్నిటీ సెలవులపై స్వదేశం వెళ్లనున్న నేపథ్యంలో అజింక్యా రహానే మిగిలిన టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

టీమిండియా ఘోర ఓటమిని అభిమానులు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు.మెరుగైన ఫామ్‌లో ఉన్న కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మ, రిషభ్‌ పంత్‌ వంటివారిని పక్కనబెట్టి పృథ్వీ షా, వృద్ధిమాన్‌ సాహాను ఆడించారని ట్రోల్స్‌ చేస్తున్నారు. ఇప్పటికైనా జట్టు కూర్పులో టీమిండియా యాజమాన్యం శ్రద్ధ వహించాలని సూచిస్తున్నారు. కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మ, రిషభ్‌ పంత్‌కు తుది జట్టులో అవకాశం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. (చదవండి : అలా టీ కోసమని వెళ్లొచ్చా, అంతా ఖతం!)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top