మళ్లీ మరీన్‌ చేతిలో...

Another defeat for PV Sindhu - Sakshi

పీవీ సింధుకు మరో పరాజయం 

ఒడెన్స్‌: పీవీ సింధు, కరోలినా మరీన్‌ మధ్య మంచి స్నేహం ఉంది. కోర్టులో ప్రత్యర్థులే అయినా కోర్టు బయట తమ సాన్నిహిత్యం గురించి వీరిద్దరు చాలా సార్లు చెప్పుకున్నారు. కానీ శనివారం ఇద్దరి మధ్య జరిగిన హోరాహోరీ పోరు అనూహ్య రీతిలో సాగింది. ఒక దశలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ప్రత్యర్థిపై పైచేయి సాధించే క్రమంలో అరుపులు, కేకలతో పాటు పలు మార్లు ఇద్దరూ అంపైర్ల హెచ్చరికకు కూడా గురయ్యారు.

అయితే చివరకు 73 నిమిషాల సమరం తర్వాత భారత షట్లర్‌ పరాజయం పక్షానే నిలిచింది. ఈ మ్యాచ్‌కు ముందు ముఖాముఖీ రికార్డులో సింధు 5–10తో వెనుకబడి ఉండగా, ఇప్పుడు అది 5–11కు చేరింది. బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 టోర్నీ డెన్మార్క్‌ ఓపెన్‌ సెమీ ఫైనల్లో సింధు ఓటమిపాలైంది. కరోలినా మరీన్‌ (స్పెయిన్‌) 21–18, 19–21, 21–7 స్కోరుతో సింధుపై విజయం సాధించింది.  

ఇద్దరు ప్లేయర్లు తమదైన శైలిలో చెలరేగడంతో తొలి గేమ్‌ దాదాపు సమంగా సాగింది. విరామ సమయంలో సింధు 11–10తో ఒక పాయింట్‌ ముందంజలో ఉంది. ఆ తర్వాతా ఇదే కొనసాగి స్కోరు 18–18కి చేరింది. అయితే మరీన్‌ వరుసగా మూడు పాయింట్లు గెలుచుకొని గేమ్‌ను తన ఖాతాలో వేసుకుంది. రెండో గేమ్‌లో మాత్రం సింధు దూసుకుపోయింది. చకచకా పాయింట్లు సాధించిన ఆమె ఎక్కడా ఆధిక్యం తగ్గనీయకుండా 11–3కు చేరింది. అయితే ఆ తర్వాత ప్రతిఘటించిన మరీన్‌ వరుసగా పాయింట్లు గెలుచుకొని అంతరాన్ని తగ్గించింది.

సింధు 20–16తో ముందంజలో నిలిచిన తర్వాత మరీన్‌ వరుసగా మూడు పాయింట్లు గెలవడంతో 20–19గా మారింది. కానీ స్మాష్‌తో పాయింట్‌ సాధించి సింధు గేమ్‌ గెలుచుకుంది. చివరి గేమ్‌ మాత్రం పూర్తి ఏకపక్షంగా మారిపోయింది. మరీన్‌ జోరు ముందు భారత షట్లర్‌ నిలవలేకపోయింది. ముందు 3–0, ఆపై 3–2...ఆ తర్వాత ఆమె జోరు సాగిపోయింది. వరుసగా 11 పాయింట్లు సాధించిన మరీన్‌ 14–2 దాకా వెళ్లింది. అనంతరం మ్యాచ్‌ను ముగించేందుకు ఆమెకు ఎక్కువ సమయం పట్టలేదు.  

మరీన్‌ అరుపులు... సింధు అసహనం
పాయింట్లు సాధించినప్పుడు అతిగా భావోద్వేగాలు ప్రదర్శించవద్దని అంపైర్‌ ఇద్దరినీ పిలిచి మ్యాచ్‌లో పలు మార్లు వారించాడు. అయితే మరీన్‌ తన అరుపులను ఆపకపోగా, సర్వీస్‌ అందుకునేందుకు సింధు ఎక్కువ సమయం తీసుకుంది. తొలి గేమ్‌ను మరీన్‌ను మళ్లీ అంపైర్‌  హెచ్చరించాడు.

మూడో గేమ్‌లో సర్వీస్‌ ఆలస్యానికి సింధును అంపైర్‌ ప్రశ్నించగా...‘ఆమె అరిచేందుకు అవకాశమిచ్చారు కదా. ముందు ఆమెను ఆపమని చెబితే నేనూ సిద్ధంగా ఉంటా’ అని సింధు బదులిచ్చింది. మరొకరి కోర్టునుంచి షటిల్‌ తీసుకోవద్దని ఇద్దరికీ చెప్పాల్సి వచ్చింది. చివరకు అంపైర్‌  ఇద్దరికీ ‘ఎల్లో కార్డు’లు కూడా చూపించాల్సి వచ్చింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top