యాష్‌ను టార్గెట్‌ చేసిన సంజయ్‌ మంజ్రేకర్‌

After Ravindra Jadeja Sanjay Manjrekar Now Attacks Ravichandran Ashwin - Sakshi

ముంబై: భారత అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడిగా పరిగణించబడే స్టార్‌ ఆఫ్‌ స్పిన్నర్ ర‌విచంద్రన్‌ అశ్విన్‌పై టీమిండియా మాజీ ఆటగాడు, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. 2019 వన్డే ప్రపంచకప్‌ సందర్భంగా టీమిండియా లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ రవీంద్ర జడేజాపై కూడా ఇలాంటి వాఖ్యలే చేసిన ఆయన.. తాజాగా అశ్విన్‌ను టార్గెట్‌ చేయడం చర్చనీయాంశంగా మారంది. కుంబ్లే, హ‌ర్భజ‌న్ త‌ర్వాత భారత క్రికెట్‌పై ఆ స్థాయి ముద్ర వేసిన స్పిన్నర్‌గా పేరు తెచ్చుకున్న అశ్విన్‌ను ఆల్‌టైమ్‌ గ్రేట్‌ స్పిన్నర్‌ అంటే ఒప్పుకోనని, ఎవరైనా అతన్ని అలా పరిగణిస్తే తనకు చాలా ఇబ్బందిగా ఉంటుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

అయితే, తాను చేసిన ఈ వ్యాఖ్యల వెనుక బలమైన కారణం ఉందంటున్నాడు మంజ్రేకర్‌. SENA దేశాలైన దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా పిచ్‌లపై అశ్విన్ పెద్దగా ప్రభావం చూపలేదని, ఆ దేశాల్లో అశ్విన్ ఒక్కసారి కూడా ఐదు వికెట్ల ప్రద‌ర్శన చేయ‌లేద‌ని, అలాంటప్పుడు అతన్ని ఆల్‌టైమ్‌ గ్రేట్‌గా ఎలా పరిగణిస్తారని ప్రశ్నించాడు. అశ్విన్ మంచి ప్లేయ‌రే అయ్యుండొచ్చు కానీ, ఆల్‌టైమ్ గ్రేట్స్‌ మాత్రం కాదని, అతన్ని దిగ్గజాల జాబితాలో క‌ల‌ప‌డం తనకు ఎంత మాత్రం న‌చ్చదని వ్యాఖ్యానించాడు. భారత్‌లో అశ్విన్‌కు తిరుగులేదని అంటారు. కానీ, గ‌డిచిన కొన్నేళ్లేగా జ‌డేజా కూడా అశ్విన్‌తో పోటీ ప‌డి మరీ వికెట్లు తీశాడు, ఇంగ్లండ్‌తో సిరీస్‌లో అయితే అశ్విన్ కంటే అక్షర్ ప‌టేల్ ఎక్కువ వికెట్లు సాధించాడని గుర్తు చేశాడు. 

అలాంటప్పుడు అశ్విన్‌ను దిగ్గజ స్పిన్నర్‌గా పరిగణించడం ఏమాత్రం సరికాదని ఆయన అభిప్రాయపడ్డాడు. ఓ యూట్యూబ్ ఛానెల్‌లో ఇంటర్వ్యూ సందర్భంగా మంజ్రేకర్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. కాగా, 34 ఏళ్ల అశ్విన్‌.. ప్రస్తుతం 78 టెస్ట్‌ల్లో 409 వికెట్లతో భారత్‌ త‌ర‌ఫున అత్యధిక వికెట్లు తీసుకున్న నాలుగో బౌల‌ర్‌గా కొనసాగుతున్నాడు. ఇందులో 30 ఐదు వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి. భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అనిల్ కుంబ్లే అగ్రస్థానంలో ఉండగా, కపిల్‌, హ‌ర్భజ‌న్‌లు రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. అశ్విన్‌ బౌలర్ల విభాగంలో ప్రస్తుతం టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో, ఆల్‌రౌండ‌ర్ల లిస్ట్‌లో నాలుగో స్థానంలో కొన‌సాగుతున్నాడు.
చదవండి: క్వారంటైన్‌ కంప్లీట్‌.. ప్రాక్టీస్‌ షురూ

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top