అభ్యర్థులు ఖర్చుల వివరాలివ్వాలి
ఎన్నికల పరిశీలకురాలు నిశాంతి
చేర్యాల(సిద్దిపేట): సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు ఎన్నికల ఖర్చుల వివరాలు తప్పనిసరిగా సమర్పించాలని వ్యయ పరిశీలకురాలు నిశాంతి అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బుధవారం మండల పరిధిలోని ముస్త్యాల రైతు వేదికలో నిర్వహించిన సమావేశంలో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఖర్చుల నిర్వహణపై అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో వ్యయ పరిశీలకురాలు నిశాంతి మాట్లాడుతూ అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చులకు సంబంధించిన లెక్కలు రాసి సమర్పించాలన్నారు. ఎంపీడీఓ ప్రణయ్ మాట్లాడుతూ అభ్యర్థులు ఎన్నికల నియమావలి పాటించాలన్నారు. సమావేశంలో తహసీల్దార్ దిలీప్ నాయక్, సహాయ పరిశీలకులు శ్రీనివాస్‌రెడ్డి, పోలీసు అదికారులు, బరిలో నిలిచిన అభ్యర్థులు, ఆఫీసు సిబ్బంది పాల్గొన్నారు.


