రేపే మల్లన్న కల్యాణం
పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రి కొండా సురేఖ
స్వామివారి కల్యాణం సందర్భంగా స్వామివారికి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సమర్పించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు మంత్రి తీసుకువచ్చేందుకు దేవాదాయ శాఖ.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి తీసుకున్నది.
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ● నేడు దిష్టి కుంభానికి బియ్యం సేకరణ
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి వార్షిక కల్యాణ మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఆదివారం ఆలయ తోట బావి వద్ద కల్యాణమండపంలో ఉదయం 10.45 గంటలకు స్వామివారి కల్యాణం నిర్వహించనున్నారు. వీర శైవ ఆగమశాస్త్ర సంప్రదాయం ప్రకారం ఉజ్జయిని పీఠాధిపతులు సిద్ధిలింగరాజశికేంద్రశివాచార్య మహాస్వామి పర్యవేక్షణలో కల్యాణం నిర్వహిస్తారు. మొదట ఆలయ గర్భగుడిలో మూల విరాట్‌కు కల్యాణం నిర్వహించేందుకు వధువు (బలిజమేడలమ్మ, గొల్ల కేతమ్మ) తరఫున మహాదేవుని వంశస్తులు, వరుడు మల్లికార్జున స్వామి తరఫున పడిగన్నగారి వంశస్తులు పెండ్లి పెద్దలుగా వ్యవహరిస్తారు. అదే సమయంలో తోట బావి వద్ద కల్యాణోత్సవంలోనూ వీరే పెళ్లి పెద్దలుగా వ్యవహరించనున్నారు. ఆదివారం తెల్లవారుజామున 6 గంటలకు స్వామి వారి ఆలయంలో దిష్టి కుంభం నిర్వహిస్తారు. శనివారం గ్రామంలో అందరి ఇళ్లలోంచి రతి బియ్యాన్ని తీసుకువస్తారు. దీంతో మల్లన్న కల్యాణ వేడుకల తంతు ప్రారంభమవుతుంది.
మల్లన్న కల్యాణంతో జాతర షురూ..
మల్లన్న బ్రహ్మోత్సవాలు మార్గశిర మాసం చివరి ఆదివారంతో మొదలై ఫాల్గున మాసం చివరి ఆదివారం అగ్ని గుండాలతో జాతర ముగుస్తుంది.
పూజా సామగ్రి సిద్ధం
కల్యాణోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజా సామాగ్రిని ఆలయ అర్చకులు శుక్రవారం సిద్ధం చేశారు. స్వర్ణకిరీటం, కోరమీసాలు, ఖడ్గం, రుద్రాక్షమాల, స్వామి వారి నామాలు, పంచహారతి, రుద్రపాదం, తదితర సామగ్రిని సిద్ధం చేశారు.
వైభవంగా నిర్వహిస్తాం
కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. కల్యాణోత్సవానికి సుమారు 50 వేల మందికి పైగా భక్తులు హాజరు కానున్నారు. భక్తులకు ఇబ్బందులకు కలగకుండా ఏర్పాటు పూర్తి చేశాం. – వెంకటేశ్, ఆలయ ఈఓ
రేపే మల్లన్న కల్యాణం
రేపే మల్లన్న కల్యాణం


